మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుసప్లాపులతో సతమతమయిన హీరో.. చిత్రలహరి చిత్రంతో కాస్త ఊరట చెందిన ఈ హీరోకు ఇప్పుడు బిగ్ హిట్ వచ్చినట్లే. మెగాహీరో నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం భారీ బ్లాక్ బస్టర్ చిత్రం దిశగా శరవేగంగా దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదల అయినప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో ఇతర చిత్రాలను తోసిరాజి ముందుకు సాగుతుంది. ప్రతిరోజూ పండగే చిత్రంతో పోటీ పడిన నటసింహం బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం అట్టర్ ప్లాప్ అయింది.
ఇక ఇదే సినిమాతో పాటుగా విడుదల అయిన తమిళ హీరో కార్తీ నటించిన దొంగ, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 చిత్రాలు ప్రతిరోజూ పండగే చిత్రంకు పోటీ ఇవ్వలేక చతికిల పడ్డాయి. నలుగురు అగ్రహీరోలు నటించిన ఈ నాలుగు చిత్రాల్లో భారీ పోటీ ఉన్నప్పటికి ప్రతిరోజూ పండగే భారీ బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది. ఈ సినిమా క్రిస్‌మస్ సెలవులను తనకు అనుకూలంగా మలుచుకుంది. క్రిస్‌మస్ రోజున ఈ సినిమా దాదాపు రూ.2.70కోట్లను కేవలం తెలుగులోనే రాబట్టి తన సత్తాను చాటుకుంది.
ఈ సినిమా తెలుగులో దాదాపు రూ. రూ.16కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అయితే ఈ 6రోజుల్లో రూ.15కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవేన్‌ను ఈరోజు లేదా రేపటి లోగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అ సినిమా ఓవరాల్‌గా ఈ 6 రోజుల్లో రూ.30కోట్ల గ్రాస్‌ను, రూ.18కోట్ల షేర్‌ను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిందని ఫిలింనగర్ వర్గాల కథనం. పక్కా ఫ్యామిలి సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవరికి వారే తమ పాత్రల్లో నటించకుండా జీవించడంతో సినిమాకు భారీ విజయం దక్కుతుంది. ఏదేమైనా మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ఈ సినిమా ఊపిరి పోసిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం సాయితేజ్ నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సోలో బతుకే సో బెటర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వేసవి సెలవుల్లో రానున్నది.