వైసీపీలో రెడ్ల కుత‌కుతా… ఏం జ‌రుగుతోందో జ‌గ‌న్‌కు అర్థ‌మ‌వుతోందా…!

కీల‌క‌మైన ఎన్నిక‌లు. నువ్వా-నేనా నుంచి నువ్వా-మేమా అన్న‌ట్టుగా మారుతున్న ఫైటింగ్ సీన్‌. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ఏ వ‌ర్గం అందివ‌చ్చినా.. మ‌హా ప్ర‌సాదం. ఏ నేత క‌లిసి వ‌చ్చినా.. మ‌హామ‌హా ప్ర‌సాదం. ఈ విష‌యంలో చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వ్యూహం.. ఎన్నిక‌ల‌కు ఎంత‌గా సంసిద్ధులవుతున్నార‌నేది స్ప‌ష్టం చేస్తోంది. ఇదేస‌మ‌యంలో కీల‌క‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గం వైసీపీకి దూర‌మ‌వుతున్నట్టు క‌నిపిస్తోం ది. కొంత వినేందుకు ఇబ్బందిగా ఉన్నా.. వాస్త‌వం ఇదేన‌ని వైసీపీలో కొంద‌రు రెడ్డి నాయ‌కులు వ్యాఖ్యాని స్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీలో ఉన్న మోదుగుల వేణుగోపాల రెడ్డి.. రెడ్డి నాయ‌కుల‌ను, సామాజిక వ‌ర్గం లోని వారిని ఏకం చేసే ప్ర‌య‌త్నం చేశారు. రెడ్డి పాల‌కుడు రావాల‌ని కోరుకున్నారు. ఇలా.. కీల‌క‌మై న నెల్లూరు, ప్ర‌కాశం, క‌ర్నూలు జిల్లాల్లో రెడ్డి నాయ‌కులు ఏక‌తాటిపైకి వ‌చ్చి వైసీపీకి ప‌ట్టం క‌ట్టారు. కానీ, ఇప్పుడు వీరిలో ఏ ఒక్క‌రూ ప్ర‌శాంతంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సీఎం జ‌గన్‌కు కుడి భుజం వంటి నాయ కులు ఒక్కొక్క‌రుగా పార్టీకి దూర‌మ‌య్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఆళ్ల రామ‌కృష్నారెడ్డి పార్టీకి రాంరాం చెప్పారు. ఇక‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి రేపో మాపో.. పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. పైకి లేద‌ని అంటున్నా.. నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా ఇదే దారిలో ఉన్నారు. ఇక‌, ఎమ్మిగ‌నూరు ఎమ్మెల్యే చెన్న‌కేశ‌వ‌రెడ్డి పైకి బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. బీసీకి ప్రాధాన్యం ఇవ్వ‌డంతో ఆయ‌న కూడా సైలెంట్ అయ్యారు. మ‌రోవైపు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రెడ్ల‌ను ఏకం చేసిన‌.. మోదుగుల అస‌లు అడ్ర‌స్ కూడా లేకుండా పోయారు.

ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే.. ఎక్క‌డా కూడా సీఎం జ‌గ‌న్ రెడ్డి సామాజిక వ‌ర్గం పేరు కూడా ఎత్త‌డం లేదు. పోనీ.. ప‌ద‌వులు అయినా.. ఇస్తున్నారా? అంటే.. అవి ప్ర‌జాబ‌లం లేని వారికి క‌ట్ట‌బెడుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న స‌ల‌హ‌దారుల్లో 70 శాతం మంది రెడ్లు ఉంటే.. వారు ప్ర‌జ‌ల నుంచి ఒక్క‌సారి కూడా గెలుపు గుర్రం ఎక్కిన వారు కాదు. పైగా.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే స‌మ‌ర్థ‌త ఉన్నవారు కూడా కాదు.

మ‌రోవైపు.. నా ఎస్సీ, నా బీసీ అంటున్నారే త‌ప్ప‌.. రెడ్డి వ‌ర్గం గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. కీల‌క‌మైన రెడ్ల స్థానాల‌ను కూడా.. మైనారిటీ, బీసీల‌కు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో రెడ్డి వ‌ర్గం.. అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. వీరు ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే.. అది అంతిమంగా వైసీపీపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.