నిజంగా జగన్ నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నారో ? ఎందుకు వదులుకున్నారో ? జగన్‌కే తెలియాలి. అసలు ఆయన్ను జగన్ వదులుకోవడం, పార్టీ వదులుకోవడం వైసీపీలో ఎవ్వరికి ఇష్టంలేదు. ఒక్క విడదల రజనీ, అటు వినుకొండలో బొల్లా బ్రహ్మానాయుడు మినహా ఎవ్వరూ కూడా లావును ఎప్పుడూ పన్నెత్తు మాట అనలేదు. లావు అజాత శత్రువు. రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా సాయం చేస్తూ ఉంటారు.
కక్షపూరిత రాజకీయాలు చేసేందుకు ఆయన అస్సలు ఇష్టపడరు. గత ఎన్నికలకు యేడాదిన్నర ముందే ఆయన వైసీపీలో చేరి గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కష్టపడ్డారు. అయితే చివర్లో జగన్ తన సామాజిక వర్గానికి చెందిన అప్పటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి రావడంతో జగన్ ఆయన కోసం లావుకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అప్పటికప్పుడు ఎన్నికలకు ముందు నరసారావుపేట పార్లమెంటుకు పంపి అక్కడ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు.
లావు ఆ ఎన్నికల్లో నరసారావుపేట నుంచి ఏకంగా 1.50 లక్షలకు పైగా భారీ మెజార్టీతో సీనియర్ టీడీపీ నేత రాయపాటి సాంబశివరావును ఓడించారు. ఐదేళ్లలో కేంద్రం సహకారం లేకపోయినా, కరోనా ఇబ్బంది పెట్టినా లావు తన వంతుగా కేంద్రం నుంచి భారీగానే నిధులు రాబట్టి పార్లమెంటు పరిధిలో కొన్ని అభివృద్ధి పనులు చేశారు. ఎప్పటి నుంచో కేంద్రం అనుమతులు లేక ఆగిపోయిన వరిసెలపూడి ఎత్తిపోతల పథకంకు అన్ని క్లీయర్‌రెన్స్‌లు తెప్పించారు. ఇలా ఒకటి కాదు ఎన్నో పనులు చేసి పార్టీలకు అతీతంగా మంచి ఎంపీగా పేరు తెచ్చుకున్నారు.
మరోసారి ఆయన ఇక్కడ నుంచే పార్లమెంటుకు పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా జగన్ షాక్ ఇచ్చారు. పిలిచి గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేయాలి.. ఇక్కడ వేరే వ్యక్తికి ఇస్తున్నట్టు చెప్పారు. ఇది లావుకు బాధ అనిపించింది.. తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. జగన్ ఒప్పుకోలేదు. మనసు చంపుకుని వైసీపీలో ఉండడం ఇష్టంలేక లావు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. త్వరలో టీడీపీలో చేరనున్న లావు అదే నరసారావుపేట పార్లమెంటు నుంచి పోటీకి రెడీ అవుతున్నారు.
తాను వైసీపీ నుంచి బయటకు రావడంతో పాటు ఆ పార్టీని చావుదెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. గురజాలలో ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తిని కూడా పార్టీలోకి తీసుకు వస్తున్నారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే మాక్కెన మల్లిఖార్జునరావును కూడా టీడీపీలోకి తీసుకు వస్తున్నారు. ఇది గురజాల, వినుకొండలో ఖచ్చితంగా వైసీపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని వైసీపీ వాళ్లే అంటున్నారు. ఏదేమైనా జగన్ లావును వదులుకుని తప్పు చేశాడని ఆ పార్టీ వాళ్లే ఒప్పుకుంటున్నారు.