నారా లోకేష్.. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. తెలుగు వారు ఉన్న ప్రతి ప్రాంతంలోనూ వినిపిస్తున్న పేరు ఇది! అనూహ్య రాజకీయ ప్రవేశంతోనే తన సత్తా చాటిన యువ నాయకుడిగా.. నారా లోకేష్ తనదైన పాత్రను పోషించారు. వారసత్వ రాజకీయాలతోనే పాలిటిక్స్‌లోకి అడుగులు వేసినా.. అనతి కాలంలోనే 2014లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించా రు. సోషల్ మీడియాను ఉర్రూత లూగించారు. అంతేకాదు.. సీబీఎన్ ఆర్మీ వంటి.. పదాన్ని సృష్టించి.. పార్టీలో యువతకు ప్రాధాన్యం కల్పించారు. యువరక్తాన్ని ఉరకలు వేయించారు.
ఇక, నారా లోకేష్ అంటే.. కేవలం వ్యక్తి మాత్రమే కాదు.. మూడు పదుల వయసులోనే పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగేందుకు పట్టుదలతో ముందుకు సాగారు. ఎంతో పరిశ్రమించారు కూడా. ఒకానొక దశలో 2016లో టీడీపీలోనే నారా లోకేష్‌పై అంతర్గత విభేదాలు.. వివాదాలు తెరమీదికి వచ్చాయి. ఆయన మాట మేం వినేదేంటి? అనే శైలిలో సీనియర్లు.. వ్యవహరించారు. వీరిలో చాలా మంది అగ్రనాయకులే ఉన్నారు. అయితే.. వారిని నారాలోకేష్ ఎప్పుడూ .. నేరుగా విమర్శించలేదు. అంతేకాదు.. వారి విమర్శలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
మరింతగా పరిశ్రమించారు. తెలుగు మాట్లాడడమే రాదన్న.. వైసీపీ నాయకులకు దిమ్మ తిరిగేలా .. మాట్లాడడమే కాదు.. సవాళ్లు రువ్వుతూ ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పారు. ఇక,జగన్ గారి లాగా.. నాలుగు అడుగులు కూడా వేయడం చేతకాదని ఎద్దేవా చేసిన.. మాజీ మంత్రులకు ఖంగుతినిపించేలా.. పాదయాత్ర చేపట్టి.. తన సత్తా చాటుకున్నారు. నిజానికి మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా.. ఆయన వ్యవహరించి ఉంటే.. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంత దూరం పాదయాత్ర కూడా చేయాల్సి అసవరం లేదు. కానీ, రాష్ట్రంలో వారసత్వ రాజకీయాల పాత్ర ఉన్నా.. తనదైన పాత్రకే ఆయన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే నారా లోకేష్ తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. మంత్రిగా ఉన్నప్పుడుకూడా.. అనేక కంపెనీలను తీసుకువచ్చారు. యువత ఉపాధికి నాంది పలికారు. నాయకులతోనూ మమేకమయ్యారు. యువతను తనవైపు తిప్పుకోవడంలోనూ సక్సెస్ అయ్యారు. అయితే, ఇవన్నీ ఒక్క రాత్రికి చేకూరినవి కాదు. ఎంతో పరిశ్రమ, అంతకు మించి వైసీపీ నాయకుల నుంచి ఎదురైన అవమానాలు.. ప్రతిఘటనల నుంచి వచ్చిన పట్టుదల. ఇదే నారా లోకేష్‌ను నాయకుడిగా నిలబెట్టాయి. ఆయనకంటూ ప్రత్యేకతను పెంచి పోషించాయి. ఇది ఇప్పుడు స్థిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టంగా రూపాంతరం చెందింది. భవిష్యత్తు ఆశా జ్యోతిగా ఆయనకు ప్రగతి శీలరాజకీయం మరింత చేరువైందనడంలో ఎలాంటి సందేహం లేదు.