విజ‌య‌వాడలో వైసీపీ క‌ష్టాలకు అంతేలేదా…!

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. అనుకున్న విధంగానూ సాగ‌వు. ప‌రిస్థితులు.. అభ్య‌ర్థుల‌ను బ‌ట్టి అవి ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ చేసిన ప్ర‌యోగం విక‌టించే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావును.. ఇక్క‌డ నుంచి త‌ర‌లించి. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి నియ‌మించారు.

ఇక‌, విజ‌య‌వాడ వెస్ట్ టికెట్‌ను కార్పొరేట‌ర్ స్థాయి నాయ‌కుడు.. మైనారిటీ నేత షేక్ ఆసిఫ్‌కు ఇచ్చారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లొ భాగంగా ఈ మార్పు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా చూసుకుంటే.. నియోజ‌క వ‌ర్గ స్థాయిలో ఆసిఫ్ నియామ‌కం బెడిసి కొడుతోంది. ఆయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు కార్పొరేట‌ర్‌గా నే ప‌రి మితం అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఆయ‌న ఎవ‌రోకూడా మిగిలిన సామాజిక వ‌ర్గాల‌కు తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌చారానికి వెళ్తున్నా.. గుర్తు ప‌ట్ట‌డం లేదు.

మ‌రోవైపు.. మైనారిటీ వ‌ర్గాల‌లో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న ప్ర‌స్తుత టీడీపీ నేత జ‌నాబ్ జ‌లీల్‌ఖాన్ అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. టీడీపీ టికెట్ త‌న‌దేన‌ని అంటున్నారు. ఒక‌వేళ ఇవ్వ‌క‌పోయినా.. త‌న పోటీ ఖాయ‌మ‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేస్తున్నారు. దీంతో మైనారిటీ వ‌ర్గం మొత్తం ఆయ‌న‌కు అనుకూలం గా తీర్మానాలు చేసింది. జ‌లీల్ ఖాన్ బ‌రిలో నిలిస్తే. ఆయ‌న‌కు అనుకూలంగా ఉండాల‌ని మైనారిటీ నాయ‌కులు గత‌వారం ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసి నిర్ణ‌యించారు.

ప్ర‌స్తుతం జ‌లీల్ ఖాన్ ఇబ్బందుల్లో ఉన్నార‌ని.. ఆయ‌న గ‌తంలో త‌మ‌కు ఎన్నో మేళ్లు చేశార‌ని.. వారు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఆసిఫ్‌కు స‌హ‌క‌రించేవారు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఇక‌, వెల్లంప‌ల్లి సోద‌రులు కూడా.. ఆసిఫ్‌కు దూరంగా ఉన్నారు. వీరి చేతిలోనే మెజారిటీ వైసీపీ కేడ‌ర్ ఉంది. ఇది కూడా ఆసిఫ్‌కు సెగ పెడుతోంది. ఆర్థికంగా చూసుకున్నా.. వ‌చ్చే రెండు మాసాలు.. ఖ‌ర్చులు భ‌రించ‌డం ఈయ‌న వ‌ల్ల‌కాద‌ని తేలి పోయింది. ఇప్పుడు ఖ‌ర్చు చేస్తే.. ఎన్నిక‌ల నాటికి ఇబ్బందేన‌ని ఆయ‌నే చెబుతున్నారు. దీంతో వెస్ట్ రాజ‌కీయం వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది.