టార్గెట్ @ 120 నినాదంతో టీడీపీ అడుగులు పడుతున్నాయి. పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ఆదివారం నుంచి జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవ ర్గాలచొప్పున 40 రోజుల పాటు ఆయన నిర్విరామంగా పర్యటించనున్నారు. టికెట్ల వ్యవహారం దాదాపు కొలిక్కి రావడం.. నేతల్లోనూ జోష్ కనిపిస్తుండడంతో మరింత దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయిం చుకున్నారు.
శంఖారావం పేరుతో ఈ కార్యక్రమాలకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. ఈ కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించనున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే అంశంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఇప్పటి వరకు యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్ర కొన్ని కారణాలతో మధ్య మధ్య బ్రేకులు ఇస్తూ.. ముందుకు సాగింది. అయితే.. ఈ క్రమంలో కొన్నినియోజకవర్గాల్లో ముందుకు సాగలేదు. ఆయా నియోజకవర్గాలను ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని నారా లోకేష్ శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తున్నారనేది పార్టీ మాట.
కానీ, అంతర్గతంగా చూస్తే.. పెట్టుకున్న లక్ష్యం 120 నియోజకవర్గాలు. అంటే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా పోటీ చేసే నియోజకవర్గాల సంఖ్య ఇదేనన్నది పరిశీలకుల మాట. ఇతర నియోజకవర్గాలను మిత్రులకు కేటాయించే ఆలోచనగా ఉంది. దీంతో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే 120 స్థానాల్లో ముందుగా ప్రచారం చేసి. తర్వాత మిత్రపక్షాలకు ప్రచారం చేయనున్నారు. ఖచ్చితంగా ఈ నెల 20 నుంచి ఏదో ఒక క్షణంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
ఈ క్రమంలో 40 రోజుల టార్గెట్ పూర్తి చేయడంద్వారా.. ఎన్నికలకు సమాయత్తం పూర్తి చేయనున్నారు. చివరి.. 10 నుంచి 20 రోజులు.. నగరాలను టార్గెట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం గ్రామీణ ప్రాంతాలు, నియోజకవర్గం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని నారా లోకేష్ ప్రసంగాలతో దంచికొట్టడం ఖాయమనేది కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా.. పార్టీ తరఫున పోటీ చేసే ప్రతి ఒక్కరినీ గెలిపించుకునే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.