టీడీపీ అధినేత చంద్రబాబు మూడో జాబితాలో చాలానే సాహసాలు చేశారు. తాజాగా విడుదల చేసిన మూడో జాబితాను పరిశీలిస్తే.. కీలకమైన రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు చేసిన సాహసం.. అందరినీ నివ్వెర పాటుకు గురిచేసింది. ఇలా ఎలా చేస్తారబ్బా! అని నాయకులు బుగ్గలు నొక్కుకునే పరిస్థతి ఏర్పడింది. ఆ రెండు నియోజకవర్గాలు ఒకటి పెనమలూరు, రెండు బాపట్ల ఎంపీ స్థానం. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు చేసింది సాహసమనే చెప్పాలి.
పెనమలూరులో ఇంచార్జ్‌గా ఉన్న బోడే ప్రసాద్‌కే టికెట్ ఇచ్చారు. అయితే.. దీనికి ముందు టీడీపీ కార్యా లయం నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే.. ఇక్కడ నుంచి దేవినేని ఉమాను కానీ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కానీ.. పోటీకి నిలబెడుతున్నట్టు ప్రచారం చేశారు. దీంతో తమ తమ నియోజకవర్గాలు తమకు దక్కక పోయినా.. ఎక్కడొ ఒక చోట నుంచి పోటీ అయితే చేస్తున్నాం కదా.. కూటమి గాలిలో కొట్టుకు వచ్చేయచ్చని వారు ఆశలు పెట్టుకున్నారు. కట్ చేస్తే.. చివరకు వారికి నిరాశే ఎదురైంది.
ఇక, బాపట్ల ఎంపీ స్థానం విషయానికి వస్తే. . రెండు రోజుల ముందు వరకు కూడా.. టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఎం.ఎస్. రాజు కు ఆశ పెట్టారు. ఆయన గురించి నియోజకవర్గంలో ఐవీఆర్ ఎస్ సర్వే అం టూ.. పెద్ద ఎత్తున సర్వే చేసినట్టు కూడా.. పేర్కొన్నారు. ఇక, మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే వైసీపీ రెబల్ ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా వినిపించింది. ఇవన్నీ ఇలా ఉంటే.. మాజీ ఎంపీ పనబాక లక్ష్మికి ఈ టికెట్ ఇస్తున్నట్టు ప్రచారంలోకి తెచ్చారు.
ఈ పరిణామాలతో.. వారంతా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే.. పెనమలూరులో కొంత నయం . కనీసం ఇంచార్జ్‌కైనా టికెట్ దక్కింది. కానీ, బాపట్ల విషయానికి వస్తే.. మాత్రం ఊరు, పేరు పార్టీతోనూ సంబంధం లేని కృష్ణప్రసాద్(మాజీ ఐపీఎస్)కు చంద్రబాబు వరమాల వేశారు.ఇది తమ్ముళ్లను షాక్‌కు గురి చేసింది. దీంతో చంద్రబాబు ఇలా చేశారేంటనే చర్చ తెరమీదికి వచ్చింది.
అయితే.. తన తమ్ముళ్లు తన మాట వింటారని, తన ఆదేశాలను పాటిస్తారని, పార్టీవి స్తృత భవిష్యత్తును దృస్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలకు వారు బద్ధులై ఉంటారనే ఏకైక విశ్వాసం.. అచంచల నమ్మకంతోనే చంద్రబాబు ఇలా చేసి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. మరి తమ్ముళ్లు చంద్రబాబు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.