ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పరుచూరు. ప్రకాశం జిల్లాలో వైసీపీ బోణీ కొట్టని నియోజకవర్గాల్లో ఇది కీలకమైన సూగ్మెంట్. పార్టీ పెట్టిన తర్వాత.. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకున్నా.. ఇక్కడ మాత్రం కుప్పిగంతులు వేస్తూనే ఉంది. దీనికి ప్రధాన కారణం.. బాధ్యులను మార్చడం.. వారికి స్థానిక నేతలతో సమన్వయం లేకపోవడం. పార్టీ అధిష్టానం ఎంతగా నచ్చజెప్పినా.. ఫలితం లేకుండా పోతోంది.
దీంతో వైసీపీ పరుచూరులో పాగా వేయడం అనేది కలగానే మారుతోంది. వైనాట్ 175 అంటున్న వైసీపీకి ఈ సీటు దక్కించుకోవడం కలలో మాటగానే మారుతుందని ఇప్పుడు కూడా లెక్కలు వస్తున్నాయి. వాస్తవా నికి ఇక్కడ నుంచి విజయం దక్కించుకునేందుకు గత రెండేళ్ల నుంచి వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ మేరకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, కీలక నేత వాసుబాబు వంటివారు ఏమాత్రం సహకరించడం లేదు. పైగా వర్గ పోరుతో ఇక్కడ వైసీపీ కుదేలవుతోంది.
రెండేళ్ల కిందట ఆమంచి కృష్ణమోహన్‌ను ఇక్కడ ఇంచార్జ్‌గా నియమించారు. ఆమంచి కొంత ప్రయత్నం చేసినా క్షేత్రస్థాయిలో అసమ్మతిని ఆయన కూడా లైన్‌లో పెట్టలేక చేతులు ఎత్తేశారు. అంతేకాదు.. ఏకంగా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ.. ఇక్కడ చీరాలకు చెందిన ఎన్నారై ఎడం బాలాజీని రంగంలోకి దింపింది. అయితే.. కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉన్న ఈ నియోజ కవర్గంలో కాపు నేతలను రంగంలోకి దింపడంతో స్థానిక నేతలు ఒప్పుకోవడం లేదు.
ఈ పరిణామాలతో వైసీపీ కోరుకోవడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వరుస విజయాలు దక్కించుకున్నారు.ప్రస్తుతం ఆయనే మరోసారి ఇక్కడ పోటీకి దిగారు. అయితే.. ఈయనకు ఎదురు లేదు. ఆయనను వ్యతిరేకించేవారు.. అసమ్మతి రాగం తీసేవారు మచ్చుకు కూడా కనిపించడం లేదు. పైగా క్షేత్రస్థాయిలోని కారంచేడు మండలం నుంచి పరుచూరు వరకు అంద రూ ఆయననే కోరుకుంటున్నారు. ఎందరు అభ్యర్థులను మారుస్తున్నా.. ఎన్ని స్ట్రాటజీలు వాడుతున్నా కూడా ఇక్కడ పార్టీ గెలిచే అవకాశం కనుచూపు మేరలో కూడా కనపడకపోవడంతో జగన్‌కు సైతం పరుచూరు మీద ఆశలేదని వైసీపీ వాళ్లే చర్చించుకుంటున్నారు.