ఉమ్మడి కృష్ణా జిల్లోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున ఫైర్ బ్రాండ్ కొడాలి నాని పోటీ చేయనున్నారు. వాస్తవానికి 2004 నుంచి కూడా నాని ఇక్కడ గెలుస్తూ వచ్చారు. ఇది వరుసగా ఆయనకు ఐదో ఎన్నిక. వరుసగా రెండు సార్లు 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున నాని పోటీ చేశారు. ఇక, ఆ తర్వాత వైసీపీ నుంచి రెండు సార్లు పోటీ చేశారు. విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు మూడో సారి కూడా వైసీపీ నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. 2014, 2019, ఇప్పుడు కూడా అభ్యర్థులనుమారుస్తూ వచ్చింది. అయితే.. గతం ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం బలమైన నాయకుడినే రంగంలోకి దిగింది. ఆర్థికంగానే కాకుండా.. మానసికంగా కూడా.. నియోజకవర్గానికి బలమైన వ్యక్తిగా వెనిగండ్ల రాము పేరు వినిపిస్తోంది. ఆయన రాజకీయంగా తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. దీనిని ప్రజలకే వదిలేస్తున్నారు. తాను చేయాలని అనుకుంటున్న కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.
ప్రజలను కలుస్తున్నారు. దానినే ఎన్నికల స్ట్రాటజీగా వెనిగండ్ల ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడున్న వారినైనా కలుసుకునేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కష్టాల్లో ఉన్నామని ఆయనకు సమాచారం పంపితే చాలు.. తానే స్వయంగా తెల్లారేసరికి వారి ఇంటి ముందు వాలుతున్నారు. తాను ఉన్నానంటూ.. ఆయా సమస్యలను వింటున్నారు. పరిష్కారం కూడా అక్కడికక్కడే చెబుతున్నారు. ఒక పుస్తకాన్ని పెట్టుకుని ఆయా సమస్యలను నమోదు చేసుకుంటున్నారు. ఇదంతా.. గుడివాడ ప్రజలకు చాలా కొత్తగా ఉంది.
ఎందుకంటే.. ఇప్పటి వరకు సమస్యలు చెప్పుకొనే వారు ఉన్నారే తప్ప.. వినేవారు వారికి కనిపించలేదు. పైగా.. నేనున్నానంటూ.. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్న వారు కూడా లేరు. ఇక, నాని విషయానికి వస్తే.. గడిచిన నాలుగు ఎన్నికల్లోనూ ఆయన ఎంత బలమైన మాస్ నాయకుడే అయినా.. 20 వేల మార్కు ఓట్ల మెజారిటీ అయితే సాధించలేక పోయారు. 2004లో 7 వేలు, 2009లో 17 వేలు, 2014లో 11 వేలు, 2019లో 19 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీనే దక్కించుకున్నారు.
దీనినే ఇప్పుడు వెనిగండ్ల టార్గెట్ చేసుకున్నారు. సాధారణంగా పడే ఓట్లు ఎలా నూ పడతాయి. దానిని కొంత అధిగమించి.. 20 వేల ఓట్లు అధికంగా తెచ్చుకుంటే చాలు గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే విధంగా ఆయన వ్యూహాత్మకంగా మాస్కు చేరువ అవుతున్నారు. దీంతో గుడివాడ ప్రజల్లో కొంత మార్పు అయితే గ్రౌండ్‌లో క్లీయర్‌గా కనిపిస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.