వైసీపీ నేతలను బెంబేలెత్తించే సర్వే ఒకటి వెలుగు చూసింది. అయితే.. ఇది ఆన్‌లైన్ సర్వే కావడం గమ నార్హం. ఇప్పటి వరకు వైసీపీ రూరల్ ప్రాంతాలపై ఆశలు పెట్టుకుంది. పట్టణాల్లో ఎలానూ చదువుకున్న వారు., మధ్యతరగతి వర్గాలు తమకు యాంటీగా ఉన్నాయని కొన్నాళ్లుగా వైసీపీనే గుర్తించింది. దీంతో గ్రామీణ ప్రాంత ఓటర్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. పైగా విపక్షాల ప్రభావం కూడా.. పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్నట్టుగా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కడా కనిపించడం లేదు.
దీంతో వైసీపీ గ్రామీణ ప్రాంతాలపైనే ఎక్కువగా నమ్మకం, ఆశలు కూడాపెట్టుకుంది. ప్రధానంగా ప్రతి నెలా 1నే ఇంటింటికీ పింఛన్లు ఇస్తుండడం.. ఇంటికే రేషన్ అందిస్తుండడం.. ఏ అవసరం వచ్చినా.. వలంటీర్లు వెన్నంటే ఉండడం.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి.. రైతులకు వెన్నుదన్నుగా ఉండడం వంటివి వైసీపీ తమకు మేలు చేస్తున్నాయని అంచనా వేసింది. ఇది మంచిదే. నిజం కూడా.
కానీ, ఇప్పుడు అనూహ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ గళం మారిపోతున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను బెంబేలెత్తిస్తోందని తెలుస్తోంది. బీజేపీతో జతకట్టిన తర్వాత.. టీడీపీ, జనసేనలపై ధైర్యం పెరిగిందని తాజాగా ఓ ఆన్‌లైన్ సర్వే తేల్చి చెప్పింది. ముఖ్యంగా టీడీపీ లో పార్టీ తరఫున పనిచేస్తున్న వలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలపై గ్రామీణ ప్రజలకు నూరిపోస్తున్నారు. అంతేకాదు.. అక్కడికక్కడ గ్రామీణ ప్రజలతో ఆయా పథకాలకు రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తున్నారు.
ఇంటింటికీ ఏదో ఒక పథకం ఖచ్చితంగా అందుతుందని చెబుతున్నారు దీంతో గ్రామీణులు ఇప్పుడు కూటమి వైపు అడుగులు వేస్తున్నట్టు సర్వే చెబుతోంది. జగన్ కంటే కూడా మెరుగైన విధంగా పథకాలు అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు వైపు గ్రామీణ ఓటర్లు, ముఖ్యంగా మహిళా ఓటర్లు మొగ్గు చూపుతున్నారని సర్వే తేల్చి చెప్పడం గమనార్హం. దీంతో గ్రామీణ ఓటర్ల గళం మారుతోందని వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.