టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? తన బలం, తన బలహీనతలను అంచనా వేసుకుని ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నారా? ఈ క్రమంలో ఆయన స్పష్టమైన టార్గెట్‌ను నిర్ణయించుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. పడ్డ చోటే నిలబడాలన్న సామెతను పుణికి పుచ్చుకున్న నారా లోకేష్.. 2019లో ఎక్కడ ఓడారో.. అక్కడ నుంచే ఆయన గెలుపు గుర్రం ఎక్కి తీరాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో పోటీ చేసిన నారా లోకేష్.. ఓడిపోయా రు. నాన్ లోకల్ అని అధికార పార్టీ ముద్ర వేయడంతో.. కొంత మైనస్ అయింది. దీంతో లోకేష్ స్వల్ప మెజారిటీ తేడాతో గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. ఈ క్రమంలో ఆయన ముందు మరో రెండు నియోజక వర్గాలు వచ్చాయి. వాటిలో ఏది ఎంచుకున్నా.. ఓకే మనకు కంచుకోటలంటూ.. పార్టీలో చర్చ సాగింది. అక్కడ నుంచి పోటీ చేస్తే.. గెలుపు ఖాయమని అన్నారు.
అయితే.. నారా లోకేష్ మాత్రం `పార్టీకి కంచుకోటల్లో నిలబడితే.. నేనేకాదు.. ఎవరైనా గెలుస్తారు. ఎదురు గాలి వీచినప్పుడు.. ఎదురీతకు సిద్ధమైతే ఆ మజానే వేరు` అని నిర్ణయించుకుని ఆదిశగానే అడుగులు వేశారు. తిరిగి మంగళగిరిలోనే పోటీ చేస్తానని గత ఎన్నికల తర్వాత.. ఆయన చెప్పిన మాటలకు కట్టుబడి అక్కడే పోటీకి రెడీ అయ్యారు. అయితే.. ఈ సారి ఆయన పక్కా వ్యూహంతో ఉన్నారు. పొరపాట్లకు తావు లేకుండా ముందుకు సాగుతున్నారు.
ప్రతి ఇంటికీ వెళ్లారు. వెళ్తున్నారు. సమస్యలు ఉన్న చోట నేన్నానంటున్నారు. ప్రజలకు అవసరమైన సాయం చేస్తున్నారు. ముఖ్యంగా రోజు వారీ కార్మికులు, కూలీలకు.. ఆయన తొపుడు బండ్లు.. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి సాయం, చేతివృత్తుల వారికి సాయం ఇలా అందరికీ నేనున్నానంటూ ముందుకు సాగుతున్నారు. ఇక, ఇప్పుడు లక్ష్యం విషయానికి వస్తే.. సాధ్యమైనంత వరకు.. పార్టీలోకి ఎక్కువ మందిని ఆహ్వానించడం, రెండు మెజారిటీపైనే ఫోకస్ చేయడం.
`నేను గెలుస్తా. ఈ విషయంలో ఢోకా లేదు. కానీ, లక్షమెజారిటీ రావాలి. పోనీ.. 70-50 వేల మెజారిటీ అయినా.. రావాలి` అని తాజాగా నారా లోకేష్ దుగ్గిరాలలో వైసీపీ నుంచి వచ్చి టీడీపీలోకి చేరిన వారికి ఆయనతేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ తరహా మెజారిటీ వచ్చేందుకు తాను కృషి చేస్తున్నానని.. మీరు సైతం.. ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో… మొత్తానికి నారా లోకేష్ లక్ష్యం స్పష్టమైంది. ఇక, తమ్ముళ్లదే ఆలస్యం!!