ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. అయితే.. ఇది ఓటమిని కోరి కోరి తెచ్చుకునే పరిస్థితి వస్తే మాత్రం ఆ పార్టీలో ఏదో తేడా కొడుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇలాంటి హెచ్చరికే.. తెలుగు దేశం పార్టీ నాయకుల గురించి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఐక్యంగా ఉంటే.. ఆ సీటు మీదే! అనే మాట అందరి నోటా వినిపిస్తుండడం గమనార్హం. అదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. ఇప్పటి వరకు నేరుగా టీడీపీ విజయం దక్కించుకోని ఏకైక సీటు విజయవాడలో ఇదే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఈ దఫా అయినా.. దక్కించుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడ ప్రధాన లోపం తమ్ముళ్ల మధ్య ఐక్యత లోపించడమేనని అంటున్నారు. వాస్తవానికి ఈసీటును జనసేనకు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. కానీ, మారిన పరిణామాల నేపథ్యంలో జనసేనకు ఈ టికెట్ ఇవ్వకుండా.. తామే తీసుకుందామని టీడీపీ నిర్ణయించుకున్నట్టు ప్రచారంలో ఉంది. దీనిపై కీలక నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.
ఎవరికి వారుగా ఈ టికెట్ తమదంటే తమదేనని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఐక్యత లోపించింది. పైగా వ్యాపార వర్గాలు రెండుగా చీలిపోయాయి. మైనారిటీ వ్యాపార వేత్తలు అందరూ.. జలీల్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు.. తాజాగా సమావేశం నిర్వహించి మరీ చెప్పుకొచ్చారు. ఇక, వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు.. తటస్థంగా ఉన్నట్టు తెలిపారు. వీరు గత ఎన్నికల్లో వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అనుకూలంగా చక్రం తిప్పారు. అయితే..త మకు ఇచ్చిన హామీలుఒక్కటి కూడా నెరవేర్చలేదని చెబుతున్నారు.
మరోవైపు.. మార్వాడీ వర్గాలు కూడా తటస్థంగానే ఉన్నాయి. ప్రధానంగా ఈ మూడు వ్యాపార వర్గాలు కూడా .. వెస్ట్ రాజకీయాలను శాసిస్తున్నాయి. ఇలా రెండు కీలక వర్గాలు తటస్థంగా మారడానికి టీడీపీవైపు ఉండకపోవడానికి కారణం.. పార్టీలో నేతల మధ్య ఐక్యత లేకపోవడమేనని తెలుస్తోంది. ఇప్పటికైనా తమ్ముళ్లు కలసి కట్టుగా ఉంటే.. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చారన్న దానితో సంబంధం లేకుండా పనిచేస్తే.. గెలుపు గుర్రం ఎక్కడం ఈజీనేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.