ఏపీ అధికార పార్టీ వైసీపీలో మరో వికెట్ పడేందుకు రెడీ అయింది. అది కూడా.. టికెట్ ఇవ్వబోమని.. పార్టీ చెప్పడమో.. ప్రాదాన్యం లేదని పక్కన పెట్టడమో చేసిన నాయకుడు కాదు. ఏకంగా అసెంబ్లీ స్తాయి నుంచి పార్లమెంటుకు ప్రమోషన్ కల్పించిన నాయకుడే జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. అదికూడా ఎస్సీ నాయకుడు కావడం గమనార్హం. ఆయనే కోనేటి ఆదిమూలం. ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం.. తాజాగా రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
సత్యవేడు నియోజకవర్గం టికెట్ను మరోసారి ఆదిమూలం ఆశించారు. అయితే.. ఆయనను తిరుపతి పార్లమెంటుకు పంపించారు. పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో కోనేటి ఆదిమూలం పేరు ఉండడం గమనార్హం. అయితే.. ఆదిమూలం మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. గతంలోనే ఆయన మంత్రి పెద్దిరెడ్డిని కలిసి.. తనకు తిరిగి సత్యవేడునే ఇవ్వాలని విన్నవించారు. అప్పట్లో ఆయన పాదనమస్కారం చేయడం కూడా.. రాజకీయంగా చర్చకు వచ్చింది.
అయినప్పటికీ.. సామాజిక వర్గాల కూర్పు, నేతల గ్రాఫ్‌లను పరిగణనలోకి తీసుకున్నామంటూ.. వైసీపీ అనూహ్యంగా నేతలను మార్పు చేసింది. ఈ క్రమంలో ఆదిమూలంను కూడా మార్చి .. తిరుపతికి పంపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానానికి కోనేటి పలు మార్లు చెప్పి చూసినా.. ఫలితం దక్కలేదు. దీంతో తాజాగా ఆయన తన సన్నిహితులతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి, నియోజకవర్గం మార్పుపై చర్చించారు. పార్టీ మారడమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీకి టచ్‌లోకి వెళ్లారు. పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన చంద్రబాబు రా..కదలిరా! సభ సందర్భంగా రహస్యంగా చంద్రబాబుతో భేటీ అయిన ఆదిమూలం.. పార్టీ మార్పు విషయాన్ని ఆయనతో చర్చించారు. దీనికి బాబు కూడా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఆదిమూలం పార్టీ మారడం ఖాయమనే చర్చ సాగుతోంది. దీనిపై ఆదిమూలం ప్రకటన చేయాల్సి ఉంది. అయితే.. చిత్రం ఏంటంటే.. టికెట్ ఇస్తామని ప్రకటించిన తర్వాత.. కూడా ఇలా జంప్ చేయడం ఆసక్తిగా మారింది.