రజకుల రాజకీయ ఆకాంక్ష నెర‌వేరుస్తోన్న చంద్ర‌బాబు.. ర‌జ‌క మ‌హిళ‌కు ఎమ్మెల్యే టిక్కెట్‌…!

తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు.. బీసీల‌ను రాజ‌కీయంగా ఎదిగేలా.. ఎంతో మంది బీసీలు రాజ‌కీయంగా ఉన్నత స్థానాల‌కు చేరుకునేలా చేయ‌డంలో తెలుగుదేశం పార్టీది అందేవేసిన చేయి. ముందు ఎన్టీఆర్ ఆ త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలో టీడీపీ బీసీ నేత‌ల‌ను త‌యారు చేసిన ఖార్ఖానాగా మారింది. బీసీలంటేనే బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు… వీరిలో ర‌జ‌క సామాజిక వ‌ర్గంలో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే రాజ‌కీయంగా ముందుకు వ‌స్తుంటారు. ఈ సామాజిక వ‌ర్గం వారు రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మంది ఉన్నా అనుకున్న స్థాయిలో చ‌ట్టస‌భ‌ల ప‌రంగా వీరికి ప్రాథినిత్యం ద‌క్క‌లేదు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బ‌స్వ‌రాజు సార‌య్య‌కు ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇవ్వ‌డంతో పాటు మంత్రిని చేసింది. మ‌ళ్లీ అదే కాంగ్రెస్ తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో షాద్‌న‌గ‌ర్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సీటు నుంచి అదే ర‌జ‌క సామాజిక వ‌ర్గానికి చెందిన ఈర్ల‌ప‌ల్లి శంక‌ర్ అనే ర‌జ‌క యువ‌కుడికి సీటు ఇచ్చి అసెంబ్లీకి వ‌చ్చేలా చేసింది. విభ‌జిత ఏపీలో ర‌జ‌క సామాజిక వ‌ర్గం నుంచి ఫ‌స్ట్ టైం చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లిన నేత‌గా ఎమ్మెల్సీ దువ్వార‌పు రామారావు రికార్డుల్లోకి ఎక్కారు.

ఈ క్రెడిట్ ఖ‌చ్చితంగా చంద్ర‌బాబుకే ఇవ్వాలి. చంద్ర‌బాబు ర‌జ‌క సామాజిక వ‌ర్గానికి చెందిన దువ్వారపు రామారావును గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఎమ్మెల్సీగా పంపారు. ఇక రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ముందునుంచి కూడా ర‌జ‌క సామాజిక వ‌ర్గం మెజార్టీ టీడీపీ వైపే ఉంటోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చంద్ర‌బాబు మ‌రో డేరింగ్ స్టెప్ తీసుకోనున్నారు. ఈ సారి ఏకంగా ఈ సామాజిక వ‌ర్గం నుంచి ఓ మ‌హిళ‌ను అసెంబ్లీ బ‌రిలో దింప‌డానికి బాబు రెడీ అవుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ర‌జ‌క సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న గుంటూరు జిల్లాకు చెందిన గ‌ల్లా మాధ‌విని గుంటూరు వెస్ట్ నుంచి బ‌రిలోకి దింప‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టు తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ నుంచి బీసీ మ‌హిళ అయిన మంత్రి విడ‌దల ర‌జ‌నీని జ‌గ‌న్ రేసులో దించారు. ఇప్ప‌టికే ఆమె ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ర‌జ‌నీని నిలువ‌రించేందుకు ర‌క‌ర‌కాల ఈక్వేష‌న్లు ఆలోచించిన చంద్ర‌బాబు బీసీ + మ‌హిళా కోటాలో మాధ‌విని దింపాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

గ‌ల్లా మాధ‌వి ప్ర‌స్తుతం వికాస్ హాస్ప‌ట‌ల్స్‌కు డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఎంతోమంది పేద‌ల‌కు త‌న హాస్ప‌ట‌ల్స్ ద్వారా త‌క్కువ ఖ‌ర్చుతో వైద్యం అందించ‌డంతో పాటు ర‌క‌ర‌కాల సేవ‌లు అందిస్తున్నారు. మాధ‌వి భ‌ర్త గుంటూరుతో పాటు చుట్టుప‌క్క‌ల రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు త‌న హాస్ప‌ట‌ల్స్ ద్వారా, అనేక సేవా కార్య‌క్ర‌మాల‌తో న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులే. ఏదేమైనా నిన్న‌టి వ‌ర‌కు వైసీపీలో జోష్‌గా ఉన్న గుంటూరు వెస్ట్ రాజ‌కీయం.. టీడీపీ కూడా బీసీ రజ‌క మ‌హిళ‌నే దింపుతోంద‌న్న వార్త‌ల‌తో ఆ పార్టీలో కూడా ఉలిక్కిపాటు అయితే స్టార్ట్ అయ్యింది.