వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే సామాజిక న్యాయం గురించి తెగ లెక్చర్లు ఇస్తూ ఉంటారు. సామాజిక న్యాయం పేరుతో తానేదో పెద్ద సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంటానని చెపుతున్నారు. ఇక ఆయన కేబినెట్లో బీసీలు, ఎస్సీలకు గత టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువగానే పదవులు కట్టబెట్టారు. ప్రస్తుతం ఇస్తోన్న ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులోనూ బీసీలకు గతంలో ఏ పార్టీ ఇవ్వనట్టుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ విషయంలో జగన్‌ను ప్రశంసించాల్సిందే.
అయితే ఇతర అగ్రవర్ణాలను మాత్రం జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తున్నా అందులోనూ ఒకటి రెండు కులాలకే ఎక్కువుగా టిక్కెట్లు కేటాయిస్తూ మిగిలిన బీసీలకు అన్యాయం చేస్తోన్న పరిస్తితి. వైసీపీలో ఇప్పుడు ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో 51 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనిని జగన్ ఏ సామాజిక న్యాయం కోణంలో సమర్థించుకుంటారో ? ఆయనకే తెలియాలి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 30 మంది కమ్మోళ్లు మాత్రమే ఎమ్మెల్యేలు.
ఇక జగన్ కేబినెట్లో రెడ్డి మంత్రులు కూడా నలుగురు ఉన్నారు. ఇక టీడీపీని 41 సంవత్సరాల చరిత్రలో ఘోరంగా జీరోను చేస్తూ ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాథినత్యం లేకుండా చేశారు జగన్. ఏపీ కోటాలో ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీ వాళ్లే ఉన్నారు. ఈ 11 మందిలో కూడా ఏకంగా 5 గురు రెడ్లే ఉన్నారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి. సుబ్బారెడ్డి, నిరంజన్‌రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఐదుగురు రెడ్లే ఉన్నారు.
ఇక నలుగురు బీసీలకు రాజ్యసభ ఇవ్వడం గ్రేట్. అందులో జగన్‌ను ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ వారిలో రాష్ట్రానికి ఉపయోగపడుతోందెవరు.. ఆర్.కృష్ణయ్యకు ఏ కోణంలో రాజ్యసభ ఇచ్చారో వైసీపీ వాళ్లకే తెలియక జుట్టు పీక్కుంటున్నారు. పిల్లి బోస్‌ను పూర్తిగా డమ్మీని చేసేశారు. మోపిదేవి పరిస్థితి అంతే. ఇక బీద మస్తాన్‌రావు టీడీపీ నుంచి ఎన్నికల తర్వాత వచ్చిన వలసపక్షి. ఇక ఎస్సీ కోటాలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులు అయిన తొలి ఎస్సీగా చరిత్ర కెక్కారు.
ఇక పరిమళ్ నత్వాని బీజేపీ కోటాలోనో లేదా రిలయన్స్ కోటాలో లేదా ఇద్దరి కోటాలోను వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్నారు. ఆ రోజు మాత్రమే ఆయన జగన్‌ను కలిశారు. ఆయన తన వ్యాపార అవసరాల కోసం, అనిల్ అంబాని సిఫార్సుల మేరకే రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారే తప్పా ఆయన వల్ల వైసీపీకి, ఇటు రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగం లేదు. ఇప్పుడు దీనిని బట్టి జగన్ సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి చందమే అనుకోవాలి.