మైకులో మాట్లాడొద్దు. స్టూల్ ఎక్కొద్దు. నడుస్తూ పోండి. అదేగా పాదయాత్ర!` – చిత్తూరులో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభ మైన యువగళం పాదయాత్రకు రెండో రోజు అదే జిల్లా పోలీసుల నుంచి ఎదురైన సంఘటన. అంత్యంత హీనంగా.. హేళనగా పాదయాత్రను చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. ఒకానొక దశలో నారా లోకేష్ చుట్టూ.. పట్టుమని 50 మంది కార్యకర్తలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం.. కేసులు, నిర్బంధాలు, బెదిరింపులు. దీంతో పాదయాత్ర నిలిచిపోతుంద ని.. ముందుకు సాగదనే అంచనాలు కూడా వచ్చేశాయి.
ఓ వర్గం మీడియాలో వ్యతిరేక కథనాలు.. పాదయాత్ర చతికిల పడిందని.. ముందుకు సాగబోదని కూడా ప్రసారమయ్యాయి. ఇక , ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ఇదే తరహా అవహేళనలు తొంగి చూశాయి. పాదయాత్ర పని అయిపోయిందని ఒకరు.. అది పాద యాత్ర కాదు.. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అని కొందరు.. ఇలా.. అనేక రూపాల్లో అవమానకర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే. ఇలా ఎదురైన ప్రతి అంశాన్నీ ..తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. యువగళానికి తన గళం జోడించి.. ప్రజల్లో తన సత్తా చూపారు.
పోలీసులు మైకులు లాగేసుకున్నా.. జీవో నెంబరు 1ని బూచిగా చూపించి.. వాహనాలను స్టేషన్లను తరలించినా.. వండుకున్న వంటలను కూడా.. చెత్తబుట్ట పాల్జేసినా.. సీబీఎన్ ఆర్మీని కట్టడిచేసినా.. నారా లోకేష్ ప్రజల్లోనే తేల్చుకున్నారు. ప్రజల్లోనే ఉన్నారు. అహింసాయుత పంథాతోనే పాదయాత్రపై సాగిన దాష్టీకాన్ని ఎదిరించారు.అదేసమయంలో అకుంఠిత దీక్ష, సమర్థత లతో ముందుకు సాగారు. వీటికి తోడు.. అలుపెరుగని ఆత్మవిశ్వాసం కూడా.. నారా లోకేష్‌ను ముందుకు నడిపించింది. మధ్యలో తండ్రి, మాజీ సీఎం చంద్రబాబు జైలు పాలవడంతో కొంత విరామం ప్రకటించారు.
ఈ సమయంలోనూ ఇక పాదయాత్ర సాగదని చెప్పుకొచ్చిన ప్రత్యర్థులకు తిరిగి యాత్రను ప్రారంభించడం ద్వారా.. తన పట్టుదల ను చెప్పకనే చెప్పారు. ఇక, ఇప్పుడు పాదయాత్రను పూర్తి చేసుకుని, ప్రజానాయకుడిగా.. ప్రజలకష్టాలు తెలుసుకున్న యువ నేతగా నారా లోకేష్ రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో 3132 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన అతి పిన్న వయస్కుడైన నాయకుడిగా నారా లోకేష్ సరికొత్త రికార్డు రాసుకున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు లేదు. ఇకపైనా ఉంటుందనే పరిస్థితి లేదు. ఎలా చూసుకున్నా.. ఒక పట్టుదల.. మరింత ఆత్మవిశ్వాసం.. నారా లోకేష్‌ను నిజమైన నాయకుడిగా నిలబెట్టాయనడంలో అతిశయోక్తి లేదు.