సొంగాకు టీడీపీ టిక్కెట్.. బాబు ఈక్వేష‌న్ క‌రెక్టే…!

ఏలూరు జిల్లా చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కాన్‌స్టెన్సీ ఇన్‌చార్జ్‌గా సొంగా రోష‌న్‌కుమార్‌ను టీడీపీ అధిష్టానం నియ‌మించింది. గ‌త మూడున్న‌రేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ సీటు విష‌యంలో క్లారిటీ రావ‌డంతో ఎట్ట‌కేల‌కు టీడీపీ శ్రేణుల్లో జోష్ వ‌చ్చేసింది. బుధ‌వారం రోష‌న్‌కు అలా ఇన్‌చార్జ్ ఎనౌన్స్ అయ్యిందో లేదో వెంట‌నే రోష‌న్ నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న స్వ‌గ్రామం ధ‌ర్మాజీగూడెం నుంచి మొద‌లుపెట్టి నియోజ‌క‌వ‌ర్గం అంత‌టా ప‌ర్య‌టిస్తూ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను క‌లుస్తూ త‌న ప్ర‌చారం ప్రారంభించేశారు.

సొంగా ముందునుంచి టిక్కెట్ త‌న‌కే వ‌స్తుంద‌న్న ధీమాతో ఉండ‌డంతో తొలి రోజే ప్ర‌చారంలో దూకుడు చూపించిన‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సీటు కోసం పార్టీలో ప‌లువురు పోటీ ప‌డినా సొంగాకే టిక్కెట్ ఇవ్వ‌డం వెన‌క చంద్ర‌బాబు / టీడీపీ అధిష్టానం ఎలాంటి వ‌ర్క్ చేసింది ? వాళ్లు వేసుకున్న అంచ‌నాలు ఏంటి ? వాళ్ల ఈక్వేష‌న్లు ఏంట‌న్న‌ది లోతుగా ఆలోచించి చూస్తే అవన్నీ క‌రెక్టే అని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

మాదిగ సామాజిక వ‌ర్గం ముందునుంచి టీడీపీతోనే ఉంటోంది. చంద్ర‌బాబు ఎస్సీ ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ చేసిన నాటి నుంచి కూడా ( 2019లో కొంత మిన‌హాయిస్తే) మెజార్టీ సంద‌ర్భాలు, ఎన్నిక‌ల్లో టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలోని మూడు రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్ల‌లో కొవ్వూరు, గోపాల‌పురం మాదిగ‌ల‌కు ఇస్తే చింత‌ల‌పూడి ఖ‌చ్చితంగా మాల‌ల‌కు ఇస్తార‌న్న ప్ర‌చార‌మూ గ‌ట్టిగానే న‌డిచింది. ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల ఈక్వేష‌న్ ప‌రంగా చూసిన‌ప్పుడు కోన‌సీమ‌లోని మూడు రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్ల‌తో పాటు అమ‌లాపురం పార్ల‌మెంటు సీటును మాల‌ల‌కు ఇచ్చేయ‌డంతో ఇటు ఉమ్మ‌డి ప‌శ్చిమ‌లోని మూడు సీట్ల‌ను మాదిగ సామాజిక వ‌ర్గానికి కేటాయిస్తే రెండు వ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం చేసిన‌ట్ల‌వుతుంద‌న్న ఈక్వేష‌న్‌తో చివ‌ర‌కు రోష‌న్ వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపారు.

ఇటు ఫ‌స్ట్ టైం ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుండ‌డం, ఉన్న‌త విద్యావంతుడు, ఎన్నారై కావ‌డంతో పాటు ఆర్థిక బ‌లాల నేప‌థ్యంతో పాటు క్లీన్ ఇమేజ్ ఇవ‌న్నీ ఆలోచించే రోష‌న్‌ను రంగంలోకి దింపారు. ఇటు జ‌న‌సేన‌తో పొత్తు.. జంగారెడ్డిగూడెం మండ‌లంలో ఆ పార్టీ ప్ర‌భావం, లింగ‌పాలెం సొంత మండ‌లం కావ‌డం ఇవ‌న్నీ రోష‌న్‌కు చాలా ప్ల‌స్ కానున్నాయి.