రాష్ట్రంలో దళితులను తామే ఉద్ధరిస్తున్నట్టు చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు.. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో జరిగిన దారుణాన్ని ఎలా తీసుకుంటారు? ఎలా స్పందిస్తారు? అనే చర్చ ప్రారంభమైంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ బక్క చిక్కిన రైతుపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చిన్నాన్న కుమారుడు దాడి చేసిప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడంటూ సదరు బాధితుడే స్వయంగా ఆరోపణ చేయడం.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దళిత సామాజిక వర్గానికి చెందిన సదరు బాధితుడు తనపై దాడిచేసిన భరత్ దగ్గరే కోళ్ల దొడ్డిలో ఉండి జీవనం సాగిస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలో తన పొలంలో కోడి ఈకలు ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చిన్నాన్న కుమారుడు భరత్ సదరు రైతుపై విరుచుకుపడి.. చేతబడి చేస్తున్నావా? రా! అంటూ.. పరుషంగా వ్యాఖ్యానించాడట. దీనికి రైతు తమకు పనిచేయడం తప్ప.. చేతబడి చేయడం రాదని విన్నవించగా… తనకే ఎదురుచెబుతా అంటూ.. భరత్ సదరు వృద్ధుడైన దళిత రైతుపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడని ఆ గాయాలు చూపుతూ బాధిత రైతు భోరుమంటున్నాడు.
ఈ దాడిలో వృద్ధుడైన ఆ బాధితుడు తీవ్రంగా గాయపడగా.. విషయం పోలీసులకు తెలియకుండానే ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారని టాక్. ఇదిలావుంటే.. ఈ విషయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్సీలకు మేలు చేస్తున్నామంటూ.. వైసీపీ ప్రభుత్వం ఒకవైపు చెప్పుకొంటుండగా.. అదే సామాజిక వర్గాన్ని తూలనాడుతూ.. సమాజ ద్రోహులుగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్యే బంధువు ప్రయత్నించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇదిలావుంటే.. గత ఎన్నికలకు ముందే ఇదే నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే, చింతమనేని ప్రభాకర్.. వ్యాఖ్యానించినట్టుగా వైరల్ అయి ఓ వీడియోపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు నానా రభసా చేశారు. దళితులకు రాజకీయాలు ఎందుకురా! అని చింతమనేని అన్నట్టుగా అనని మాటలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసి.. ఓ ఏడాదికి పైగానే రచ్చ రచ్చ చేశారు. ముందు ఈ వీడియోపై నానా రచ్చ జరిగినా తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి.
ఇక ఇదే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి ప్రధాన అనుచరుడిగా ఉన్న దెందులూరు మండలానికి చెందిన ఓ కాంట్రవర్సీ లీడర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి దళితులు, చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ప్రతిరోజు తన వద్దకు వచ్చి నమస్కారం పెట్టి పనులకు వెళ్లాల్సిందే అని హుకుం జారీ చేసి మరీ వాళ్లను వేధిస్తున్నా గత నాలుగేళ్లుగా అడిగేవాడే లేడు.. అడ్డు చెప్పేవాడే లేడు. దీనిపై కూడా వైసీపీ నాయకులు నోళ్లు మెదపడం లేదు.
అయితే.. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే తమ్ముడు భరత్ చౌదరి దాడిచేయడం.. సదరురైతు ఆసుపత్రిలో చేరడం వంటివి సంచలనంగా మారింది. మరి దీనికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. దళిత ద్రోహి అంటూ.. అప్పట్లో చింతమనేనిపై ముద్ర వేసిన వైసీపీ జనాలు కూడా ఈ దళిత రైతుపై జరిగిన దాడిపై ఏం మాట్లాడతాయో.. మేథావులు దీనిపై ఎలా స్పందిస్తారో ? చూడాలి.