నిన్న..
`రాజకీయాలు ఎవరికి ఎలా ఉన్నాయో నాకెందుకు.. మా గుడివాడ నాకు హైవే! నాకు తిరుగులేదు. నేను ఇక్కడ తిరుగులేని నాయకుడిని. మళ్లీ ఐదోసారి కూడా గెలుపు నాదే`
నేడు..
`ఇదే నాకు చివరి ఎన్నిక. వచ్చే ఎన్నికల నాటికి 58 ఏళ్లు వచ్చేస్తాయి. అప్పటికి నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా. కాబట్టి ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి. ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని మా గుడివాడ ప్రజలను కోరుతున్నా`
కట్ చేస్తే.. ఇదీ.. ప్రస్తుతం గుడివాడ నియోజవర్గంలో వారం వ్యవధిలోనే టంగ్ మార్చేసిన సిట్టింగ్ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎమ్మెల్యే కొడాలి నాని తీరు. దీనిపైనే ఇక్కడి ప్రజలు విస్తృతంగా చర్చించుకుం టున్నారు. `పులి-పిల్లి అయిందా.. లేక, పిల్లినే మేం పులిగా భావించామా?`- స్తానిక ప్రజలు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. ఏ చెట్టూ లేనిచోట వెంపలి చెట్టే మహా వృక్షమైన చందంగా.. కొడాలి నాని ఇప్పటి వరకు రెచ్చిపోయారు. తనకు తిరుగులేదని అనుకున్నారు.
ఇదే ఆయనను గత 25 ఏళ్లుగా గుడివాడలో నాయకుడిని చేసింది. వరుస విజయాలను కూడా అందించిం ది. కానీ, నాని అనుకున్నట్టుగా ఆయనకు ఇప్పుడు గుడివాడ హైవే కాదు. గుంతలు పడిన ముళ్లదారిగా మారిపోయింది. దూసుకువచ్చిన రాము అనే ప్రజారథం ముందు.. కొడాలి అనే చిన్న ట్రక్కు.. దారి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. వెనక్కి వెళ్లడమా? పక్కన ఆగిపోవడమా? అన్నది ఇప్పుడు నాని.. ముందున్న రెండే మార్గాలుగా చర్చ సాగుతోంది.
కలుపుకొని పోవడం.. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే వ్యూహంతో ముందుకు సాగడం అన్నవి ఈ పాతికేళ్ల రాజకీయ ప్రస్తానంలో నాని ఎన్నడూ చేసిందిలేదు. తిట్లు, అరుపులుతోనే కాలం వెళ్లదీశారు. ప్రజలకు చేరువ కాలేకపోయారు. వారి మనసులు తెలుసుకోలేకపోయారు. ఎన్నికల్లో గెలిచినా.. ప్రజలను గెలవలేని దైన్యం ఇప్పుడు వెంటాడుతోంది. ప్రజల సమస్యలు తీర్చలేని దారుణ స్థితిలో నాలుగు సార్లు విజయం దక్కించుకున్న నాయకుడు ఓటమికి చేరువైన పరిస్థితి కనిపిస్తోంది.
లేకపోతే.. నాలుగు ఎన్నికల్లో విజయం దక్కించుకున్న పులి ఇప్పుడు గాండ్రింపులు మాని.. అర్ధింపుల అరుపులు వినిపించడం ఏంటి? కాలం కాకపోతే.. కాదు.. స్వయంగా చేసుకున్న రాజకీయం. ఇది ఆయనకు మెరుపు లాంటి ఓటమిని ముందే రాసిపెట్టిందని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. 25 ఏళ్ల పొలిటికల్ హిస్టరీలో తొలిసారి నాని.. చెమటలు పట్టడం కాదు.. కారుస్తున్నారని ఆయన వర్గం నేతలే చెబుతున్నారు.