ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న దగ్గర నుంచి టికెట్‌లు ఆశిస్తున్నవారి సంఖ్య కూడా అంతే రేంజ్‌లో పెరుగుతోంది. ఇప్పటికే పార్టీల్లో ఉన్నవారితోపాటు.. కొత్తగా వచ్చి చేరుతున్న నేతలతో టీడీపీలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరేసి చొప్పున నాయకులు ఉన్నారు. ఇదిలావుంటే… తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో ఇప్పుడు ముగ్గురు కృష్ణులు తెరమీదికి వచ్చారు. వీరిలో ఇద్దరు టికెట్ విషయంపై.. మాకంటే మాకేనని ప్రచారం కూడా చేసుకున్నారు.
దీంతో నూజివీడు నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను ఎవరికి ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవై పు.. ఈ ప్రచారం బాగున్నా.. కేడర్‌లో గందరగోళం ఏర్పడింది. ఎవరికి టికెట్ ఇస్తారో తెలియక.. కేడర్ ప్రస్తుతానికి మౌనంగా ఉండడంతో పార్టీ కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇక, అభ్యర్థుల విషయానికి వస్తే.. నూజివీడు నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లోనూ ఓటమి ఎదుర్కొంటున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ముందున్నారు.
తనకే టికెట్ దక్కుతుందని ముద్దరబోయిన ప్రచారం చేసుకుంటున్నారు. కేడర్ ను కూడా ఆయన తన వెంటే నడిపిస్తున్నారు. కానీ, ఇంతలోనే యువ నాయకుడు పర్వతనేని గంగాధర్ కూడా తెరమీదికి వచ్చారు. ఇటీవల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత అన్నగారు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నియోజకవర్గంలో జోరుగా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఆయన ప్రకటించుకున్నారు. అంతేకాదు.. యువగళం పాదయాత్రలోనూ పర్వతనేని యాక్టివ్‌గా ఉన్నారు. లోకేష్‌తో తనకున్న పరిచయాలే తనను ఇక్కడ నిలబెడతాయని ఆయన చెబుతున్నాయి.
ఇక, వైసీపీలో టికెట్ దక్కని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు. ఆయనకు పెనమలూరు టికెట్ ఇచ్చేపరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయన కూడా నూజివీడువైపే దృష్టి పెట్టారు. తాజాగా తన వారితో కలిసి నూజివీడులో సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి 30 నుంచి 50 మంది అనుచరులు హాజరైనట్టు తెలిసింది. దీంతో ఈయన కూడా టికెట్ పోటీలో ముందున్నట్టుగానే తెలుస్తోంది. మరి ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.