వైసీపీలో కొన్నాళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల విషయంలో పార్టీ అధిష్టానం చూసి కూడా చూడనట్టే వ్యవహరిస్తోంది. టికెట్ దక్కని కొందరు నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా.. వారితో చర్చించలేదు. పంచాయతీలు కూడా పెట్టలేదు. అయితే.. పార్టీలోనే ఉండి.. పార్టీ విషయాలపై ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ఒకరిద్దరు కీలక నాయకుల వ్యవహార శైలిని మాత్రం సీఎం జగన్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇలాంటి వారిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కీలక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముందున్నారు. ఇటీవల కాలంలో ఆయన హాట్ టాపిక్‌గా మారారు. ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చేందుకు రెడీ అయినా.. ఆయన మాత్రం తన పరివారానికి టికెట్లు కోరుతున్నారు. తనను నమ్ముకుని పార్టీలో చేరారని. వారికి టికెట్ లేదంటే ఎలా అంటూ.. వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు.. తన నియోజకవర్గంలో 25 వేల ఇంటి పట్టాలకు నిధులు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.
అంతేకాదు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన వ్యూహంతోనే మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకుందని ఆయన తన అనుచరుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఇక్కడ తమ నాయకుడే చక్రం తిప్పుతారని బాలినేని ప్రధాన అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం వైసీపీ అధిష్టానానికి చేరింది. ఈ ప్రచారాన్ని సీరియస్‌గా కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో.. `ఆయన ఎన్ని నియోజకవర్గాలు శాసిస్తున్నారో లెక్క తీయండి` అంటూ.. సీఎం జగన్ సాయిరెడ్డిని ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీని ప్రకారం.. బాలినేని దూకుడుకు చెక్ పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసిందే. ఇప్పటికే కొన్ని నియోజ కవర్గాల్లో బాలినేనితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే అభ్యర్థులను నియమించారు. ఇకపైనా అలా నే జరగనుందని తెలుస్తోంది. ఆయన ప్రభావం చూపిస్తారని అనుకుంటే.. అంతకుమించిన నాయకు లను కూడా రంగంలోకి దింపేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. ఇప్పటికీ.. బాలినేని మాగుంట విషయంలో పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మరి చివరకు ఆయనకే చెక్ పెట్టే పరిస్థితి వస్తే.. ఏం చేస్తారో చూడాలి.