ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు.. అధికార పక్షం చేస్తున్న దాడులు.. వెరసి ఒక పద్మవ్యూహం వంటి చిక్కులు ఎదురయ్యాయి. అయినా.. ఎక్కడా చలించకుండా.. పరిస్థితులకు ఎదురొడ్డి.. న్యాయ పోరాటం ద్వారా తన దైన శైలిలో ఆయా వ్యూహాలను ఛేదించి ప్రజల మధ్య నిలిచాడు ప్రకాశం జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. రాజకీయాల్లో ఏ నిముషానికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్తితులు ఉన్న విషయం తెలిసిందే. ఎటు నుంచి ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా చెప్పలేం. ఇలాంటి పరిస్థితే.. ఏలూరికి కూడా ఎదరయ్యాయి.
వరుస విజయాలతో టీడీపీ ఆత్మ గౌరవాన్ని పరుచూరులో చాటుతున్న ఎమ్మెల్యే ఏలూరి. ఉద్ధండుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై కూడా ఆయన విజయం దక్కించుకున్నారు. 2019లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైనా ఏలూరి దగ్గుబాటిని ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. 2021 వరకు ఆయన రాజకీ యాలు సాఫీగానే సాగిపోయాయి. వైసీపీ ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్‌ను ఇంచార్జిగా నియమించాక పరుచూరి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నకిలీ ఓటర్లను చేర్చడం.. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడం దగ్గర మొదలైన వివాదాలు.. గ్రానైట్ కంపెనీల్లో తనిఖీల వరకు సాగింది. అయినా ఎమ్మెల్యే ఏలూరి అన్ని వ్యూహాలను ఛేదించి బయటకు వచ్చారు.
పరుచూరు నియోజకవర్గంలో ఫాం7 ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏలూ రి పోరాటం చేశారు. అధికారులకు ఎన్నోసార్లు విన్నవించారు. దీనికి స్వాంతన రాలేదు. దీంతో ఆయన న్యాయ పోరాటం చేసి మరీ విజయం దక్కించుకున్నారు. ఇంతలోనే వైసీపీ నుంచి కక్ష సాధింపు రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల పై మైనింగ్ అధికారులు దాడులు చేయడం యజమానులను అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో ఏలూరిని కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, ఆయన న్యాయ పోరాటం చేశారు. ప్రజాప్రతినిధిగా తన విషయంలో ప్రోటోకాల్ కూడా పాటించలేదని అన్నారు. నిబంధనల ప్రకారం 41(ఏ) కింద నోటీసులు ఇవ్వలేదన్న ఏలూరి తరఫు వాదనలతో హైకోర్టు ఆయనకు అనుకూలంగా తిరుగులేని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన ప్రభుత్వం, వైసీపీ విసిరిన పద్మ వ్యూహం నుంచి సునాయాసంగా బయట పడినట్టు అయింది. మొత్తానికి ఆయన చేసిన పోరాటం… సాధించిన విజయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది.