రెండు కీలక నియోజకవర్గాల్లో.. టీడీపీ చేసిన ప్రయోగం.. అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. చాలా వ్యూహాత్మకంగా.. పక్కా ప్రణాళికతో ముందుకు సాగిందనే అంటున్నారు. ఒకటి పి.గన్నవరం, రెండు తిరువూరు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కొత్తవారికి చంద్రబాబు పెద్ద పీట వేశారు. ఈ రెండు కూడా ఎస్సీ నియోజకవర్గాలే కావడం గమనార్హం. వీటిలో పి.గన్నవరం టికెట్‌ను ప్రముఖ యూట్యూబర్ మహాసేన రాజేష్‌కు ఇవ్వడం గమనార్హం.
అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం నుంచి కొలికపూడి శ్రీనివాసరావుకు చంద్రబాబు చాన్స్ ఇచ్చారు. దీంతో ఈ రెండు స్థానాల గెలుపు ఖాయమని పార్టీ భావిస్తోంది. అయితే.. వీరి నేపథ్యాన్ని తీసుకుంటే.. గత రెండేళ్ల కిందట.. వీరికి, టీడీపీకి పెద్దగా అవినాభావ సంబంధం లేదు. పైగా.. వీరిలో ఇద్దరూ కూడా.. ఇటీవలే.. పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో సహజంగానే సీనియర్లకు ఈ ఎంపిక.. ఇబ్బంది పెట్టవచ్చు. విమర్శలకు కూడా అవకాశం కల్పించవచ్చు.
దీనిని చంద్రబాబు ఊహించకుండా ఉంటారా? అంటే.. పక్కాగా ఊహించే ఉంటారు. అందులో సందేహం లేదు. అయినా.. కూడా వారికి అవకాశం ఇవ్వడం వెనుక.. కూడా అంతే పక్కా రీజన్ ఉంది. పి.గన్నవరం టికెట్‌ను మాల సామాజిక వర్గానికి చెందిన రాజేష్‌కు, తిరువూరు టికెట్‌ను మాది గ వర్గానికి చెందిన కొలిక పూడికి చంద్రబాబు ఇచ్చారు. అయితే.. ఇదేమీ.. కళ్లు మూసుకుని చేసిన ఎంపిక కాదు. అన్ని కోణాల్లోనూ పరిశీంచి చేసిన నిర్ణయంగానే చూడాలి.
ఈ ఇద్దరు కూడా.. బలమైన గళాన్నివినిపించడంలో గత నాలుగేళ్ల నుంచి ముందున్నారు. వైసీపీ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేశారు. ఒకానొక దశలో అరెస్టుకు కూడా సిద్ధమ య్యారు. ముఖ్యంగా రాజధాని ఉద్యమంలో కొలికపూడి పాత్రను ఎవరూ తోసిపుచ్చలేరు. మాదిగ సామాజిక వర్గంలో ఆయన దూకుడు గా వ్యవహరించారు. ఇక, రాజేష్ తన యూట్యూబ్ వీడియోలతో యువతకు చేరువ అయ్యారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు.. వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. సో.. వీరిద్దరి ఎంపికపై ప్రస్తుతానికి విమర్శలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. మంచి నిర్ణయమేనని అంటున్నారు పరిశీలకులు.