వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య జరగనున్న వచ్చే ఎన్నికల పోటీలో ఎన్నారైలు(ప్రవాసాంధులు) కీలక రోల్ పోషించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ మాట ఎలా ఉన్నా.. టీడీపీలో కనీసం.. నాలుగు ఎంపీ స్థానాలకు వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అదేవిధంగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలకు వారిని ఖరారు చేయడం పక్కా అని తమ్ముళ్ల మధ్య చర్చ సాగుతోంది. వైసీపీలో అయితే.. ఇలాంటి అవకాశం పెద్దగా లేదు. అసలు ఆదిశగా కూడా పార్టీ ఆలోచన లేదు.
మరి టీడీపీలోనే ఎందుకు ఎన్నారైలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు? అంటే.. ఆది నుంచి టీడీపీకి.. ఎన్నా రైల బలం ఎక్కువ. రాష్ట్రం ఉంచి వెళ్లిన వారిలో ఎక్కువ మంది విదేశాల్లోని వారు టీడీపీకి అభిమానులు గా ఉన్నారు. పైగా ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లో చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ కంపెనీల్లో పని దక్కించుకుని ఆర్థికంగా పుంజుకున్నవారు కూడా.. బాబు అంటే ప్రాణం పెడుతున్నారు. ఇటీవల ఆయన జైల్లో ఉంటే.. దాదాపు 18 దేశాల్లో.. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అక్కడ బాబు కోసం కార్యక్రమాలు చేశారు.
అదేవిధంగా కరోనా సమయంలో వారి నుంచి ఫండ్స్ సేకరించి.. ఇక్కడ ప్రజలకు టీడీపీ నేతలు సాయం చేశారు. ఖరీదైన మందులు కూడా ఉచితంగా అందించారు. పార్టీ కార్యక్రమాలకు కూడా.. వారు ఇంట్రస్ట్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇన్ని ప్లస్సులు ఉండడంతో వారి నుంచి కూడా పోటీకి ఆసక్తి పెరిగింది. పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంటుందని.. జనసేనతో పొత్తు కలిసి వస్తుందని అంచనాలు వస్తున్న దరిమిలా.. ఎన్నారైలు పోటీకి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే గుడివాడ నియోజకవర్గాన్ని ఎన్నారైకి ఇచ్చారు. ఇప్పుడు గుంటూరు, త్వరలోనే మరో నియోజక వర్గాన్ని కూడా పార్లమెంటు స్థాయిలో ఎన్నారైకి కేటాయించనున్నట్టు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇక, అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నారైలను తీసుకురానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. `ఎంత లేదన్నా.. రాష్ట్రం మొత్తం మీద అర డజను మంది ప్రవాస నేతలు అసెంబ్లీ టికెట్ల కోసం, ముగ్గురు ఎంపీ టికెట్ల కోసం గట్టిప్రయత్నాల్లో ఉన్నారు.` అని సీనియర్ నేత ఒకరు ఆఫ్‌ది రికార్డుగా మీడియాకు చెప్పారు.