`రాజకీయంగా విభేదాలు ఉండొచ్చయ్యా. కానీ, ఆయన ఆస్తులు నేను తిన్నానా? నా ఆస్తులేమైనా ఆయ న దోచుకున్నాడా. ఇప్పుడు ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఇక్కడ చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తాం. నాకంటూ ప్రత్యేకంగా ఎలాంటి అజెండాలేదు. ఔను.. టికెట్ ఇస్తారని అనుకున్నా. కానీ, కుదరలేదు. ఏం చేస్తాం. పదేళ్లపాటు… కష్టపడి పనిచేసి, బీసీలను ఏకం చేసి.. గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తే.. వైసీపీ ఏం చేసింది..? వాడుకుని వదిలేయలేదా? టీడీపీని నేనేమీ అనడం లేదు. అవకాశం వస్తుంది.. వెయిట్ చేస్తా` – ఇదీ.. బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి చేసిన వ్యాఖ్యలు.
ప్రస్తుతం గురజాల నియోజకవర్గంలో ఈ వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో సేవలు చేసిన జంగా కృష్ణమూర్తి.. బీసీలను ఐక్యం చేసిన వైసీపీకి అనుకూలంగా ఓటేయించారు. పార్టీకి రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదిగినా జగన్ జంగా సొంత నియోజకవర్గం పిడుగురాళ్లలో ఆయనను డమ్మీని చేసి తన సొంత కులానికి చెందిన ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ కంటికి రెప్పలా కాపాడుకుంటాను.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పడంతోనే జంగా తన గురజాల సీటును కూడా 2019లో త్యాగం చేశారు.
దీనికి ప్రతిగా 2024(ప్రస్తుత) ఎన్నికల్లో టికెట్ ఇస్తామని వైసీపీ అధినేత హామీ ఇచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయి జంగా పనిచేశారు. కానీ, చివరకు జంగాకు వైసీపీ మొండిచేయి చూపించింది. దీంతో టీడీపీని ఆశ్రయించారు. టీడీపీలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో చంద్రబాబు కూడా జంగాకు సీటు ఇచ్చేందుకు తీవ్రంగానే శ్రమించారు. చివర్లో సమీకరణలు సెట్‌కాలేదు. అయినా కూడా జంగా టీడీపీ చెంత చేరేందుకు రెడీ అయ్యి చంద్రబాబును సైతం కలిశారు. ఆయన యరపతినేనికి అండగా ఉంటానని చెప్పారు.
తన తాజా ఇంటర్వ్యూలో జంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఔను.. టికెట్ రాలేదు. అయినా.. యరపతినేని కోసం పనిచేస్తానని చెప్పారు. అంతేకాదు.. టీడీపీలో చేరిన తర్వాత .. ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో యరపతినేని మావోడే అని జంగా వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో గురజాలలో యరపతినేని బలానికి జంగా బలం కూడా తోడైందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా.. వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాసుకు చుక్కలేనని అంటున్నారు పరిశీలకులు.