జాతిరత్నాలు మూవీ డైరెక్టర్‌కి దిమ్మతిరిగే షాక్.. ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనా?

 

జాతిరత్నాలు సినిమాతో కేవీ అనుదీప్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని వన్ లైనర్స్, యాక్టర్ల నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. గత ఐదేళ్లలో ఇంతలా నవ్వించిన సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో అనుదీప్‌ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మార్మోగింది. ఈ సినిమా నిర్మాణానికి సుమారు ఏడు కోట్ల ఖర్చు చేస్తే.. ఏకంగా రూ.70 కోట్లు బాక్సాఫీస్ వద్ద వసూలయ్యాయి. అలా ఒక్క సినిమాతోనే పదిరెట్లు లాభాన్ని చూపించిన అనుదీప్‌పై టాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది. అతనికి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఇలాంటి సమయంలో అతను కథ, కథనం అందించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’గా విడుదలయ్యింది. ఈ సినిమానే అతడి కొంప ముంచుతోంది.

అనుదీప్‌కి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ అనే ఇద్దరు శిష్యులు ఉన్నారు. అయితే ఈ ఇద్దరు యువ దర్శకుల చేత తాను రాసుకున్న కథ, కథనంతో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాని డైరెక్ట్ చేయించాడు అనుదీప్‌. రెండు రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కథను సింపుల్‌గా చెప్పుకుంటే ఒక పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ తన ప్రియురాలితో కలిసి ఖుషి మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటాడు. మరి అతడెలా ఫస్ట్ షో టికెట్స్ పొందాడు? అనేదే ఈ సినిమా కథాంశం. ఈ రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్‌ ఇంతకంటే మంచి స్టోరీలతో వస్తున్నాయి. సినిమాల్లో ట్విస్టులు కావాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న, చెత్త స్టోరీతో జీడిపాకం లాగా దాన్ని సాగదీసి ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టేసాడు అనుదీప్‌.

ఈ సినిమా చూసిన తర్వాత “అసలు అనుదీప్‌కు టాలెంట్ ఉందా? అతని సినిమాకి బ్యాంక్‌ రోల్ చేయొచ్చా?” అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారట నిర్మాతలు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ ఇప్పటివరకు ఒక్క జాతిరత్నాలు సినిమాతోనే హిట్ కొట్టాడు. అతడి కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాలేవీ లేవు. దాంతో అతడు తన నెక్స్ట్ సినిమాతో సత్తా చాటుకోవాల్సిన సంకట పరిస్థితి వచ్చింది. అతని నెక్స్ట్ సినిమా మరేదో కాదు శివ కార్తికేయన్‌, సత్యరాజ్ నటిస్తున్న ప్రిన్స్. ఈ సినిమాలో ఒక విదేశీ నటి కూడా నటిస్తోంది. ఇది హిట్ అయితేనే అతనికి ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. లేదంటే అతడి దుకాణం బంద్ అవుతుంది.

అనుదీప్ ముచ్చటగా మూడు సినిమాలు కూడా డైరెక్ట్ చేయలేదు. మొదటగా పిట్టగోడ మొన్నీమధ్య జాతి రత్నాలు. అంతే, జస్ట్ రెండు సినిమాలు తీయగానే ఒక మూవీ డైరెక్షన్ పర్యవేక్షించేంతా స్థాయికి వెళ్లిపోయాడు. అసలు ఎలాంటి ఆసక్తి కలిగించని కథ తీసుకొని సినిమా డైరెక్ట్ చేసి ఇప్పుడు నవ్వుల పాలవుతున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు ఇప్పుడే ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని చివాట్లు పెడుతున్నారు. అసలు అనుదీప్ లో టాలెంట్ లేదని మరి కొంతమంది తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జాతి రత్నాలకు నాగ్ అశ్విన్, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఒక వెన్నుముక లాగా నిలిచారని, అందుకే ఆ సినిమా హిట్ అయిందని.. ఈ మూవీ కథ కూడా మామూలుగానే ఉందని అంటున్నారు. ఈ డైరెక్టర్ సితార బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

Tags: Anudeep KV, first day first show, Jathi ratnalu director, Tollywood director