“ఆది పురుష్” సినిమా రివ్యూ…ప్రభాస్ ఖాతాలో మ‌రో పాన్ ఇండియా హిట్‌..!

పరిచయం :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తర్వాత మళ్లీ ఆదిపురుష్ సినిమాలో నటించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలానికి ప్రభాస్ సినిమా రావడం… రామాయణం నేపథ్యంలో తెరకెక్కడం తో భారీ అంచనాల మధ్య జూన్ 16న ఈ చిత్రం థియేటర్ లలో విడుదలైంది. మరి ఆ అంచనాలను ఆదిపురుష్ రీచ్ అయిందా…? ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా అన్నది ఈ రివ్యూ లో చూద్దాం…

సినిమా కథ :
రామాయణం గురించి మనకు తెలియనిది కాదు. ఇప్పటివరకు రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. రాముడు సీతను తీసుకుని వనవాసానికి వెళ్లడం అక్కడ రావణుడు వచ్చి సీతను ఎత్తుకెళ్లడం. దాంతో హనుమంతుడు లక్ష్మణుడితో కలిసి రాముడు వెళ్లి సీతను రక్షించడం.. ఆదిపురుష్ కూడా అదే కథతో వచ్చింది. అయితే కథలో కొత్తదనం ఏమీ లేనప్పటికీ ఆది పురుష్ సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే రామాయణం. ఈ సినిమాను భారీ వీఎఫ్ఎక్స్ తో నిర్మించారు. అంతేకాకుండా గతంలో వచ్చిన రామాయణాల్లో నటీనటుల లుక్స్ ఒకలా ఉంటే లేటెస్ట్ రామాయణం ఆది పురుష్ లో రావణుడు రాముడితో పాటు ప్రతి పాత్ర గెటప్ కాస్త భిన్నంగా ఉన్నాయి.

సినిమా ఎలా ఉంది అంటే :
ఆది పురుష్ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో వచ్చినప్పటికీ ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. పౌరాణిక చిత్రాలను ఇష్టపడేవారికి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాలో యాక్షన్ సీన్ లు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. అయితే నిజమైన రామాయణం అయితే రాముడు ప్రశాంతంగా ఎమోషనల్ గా కనిపిస్తాడు. అందులోనే రౌద్రం కూడా కనిపిస్తుంది కానీ ఆదిపురుష్ రామాయణంలో అది లోపించినట్టు కనిపించింది. ప్రభాస్ లో రాముడిలో ఉండే శాంతం… ప్రశాంతత కాస్త తగినట్టు కనిపిస్తుంది.

అయితే దర్శకుడు చెప్పాలనుకున్న కథను.. చెప్పాలనుకున్న తీరులో సక్సెస్ అయ్యాడు. సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కృతి సనన్ తన పాత్రకు న్యాయం చేసింది. అయితే సీత పాత్రకు స్క్రీన్ ప్రెసెన్స్ కాస్త తక్కువగానే ఉంది. సినిమాలో రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించాడు. సైఫ్ అలీ ఖాన్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన తానాజీ సినిమాలో నటించాడు. అయితే సైఫ్ అలీ ఖాన్ గెటప్ మరియు యాక్షన్ చూస్తే తానాజీ సెట్స్ నుండే ఆది పురుష్ సినిమాలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది.

అంతేకాకుండా ఆదిపురుష్ లో సైఫ్ గెటప్ పై మళ్ళీ ట్రోల్స్ తప్పవని చెప్పాలి. ఇక హనుమంతుడి పాత్రలో నటించిన నటుడు అద్భుతంగా నటించాడు. సినిమాలో హనుమంతుడి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. మరోవైపు మొదటి నుండి అనుకున్నట్టే విఎఫ్ఎక్స్ తేలిపోయింది. 3d సినిమా అయినప్పటికీ పక్కా త్రిడీ ఎక్స్పీరియన్స్ ను ఆదిపురుష్ ఇవ్వలేకపోయింది. కొన్ని సీన్లు మాత్రమే త్రీడీలో కనిపిస్తున్నాయి.

ఇక కొన్ని సన్నివేశాలు కార్టూన్స్ మాదిరిగా కనిపించడంతో వీఎఫ్ఎక్స్ వర్కౌట్ అవ్వలేదని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్… సినిమాటోగ్రఫీ మాత్రం మెచ్చుకోవచ్చు. అదేవిధంగా కొంతవరకు సినిమా నిరాశపరిచినా ఓం రౌత్ విజన్ ఉన్న డైరెక్టర్ అని ఈ సినిమాతో అర్థం అవుతుంది. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆది పురుష్ ఒకసారి థియేటర్ కు వెళ్లి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా.

సినిమా ప్లస్ లు ( + ) :
సినిమా ఫస్ట్ ఆఫ్
బీజీఎం
ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ చేయ‌డం

సినిమా మైనస్ లు ( – ) :
సినిమా లెంత్ ఎక్కువగా ఉండటం
రావణుడి క్యారెక్టరైజేషన్
వీఎఫ్ఎక్స్
సెకండ్ హాఫ్

ఫైన‌ల్‌గా…
ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన ఆదిపురుష్‌