త్వ‌రలో నాణ్య‌మైన రేష‌న్ బియ్యం పంపిణీ

ఏపీ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు త్వ‌రలోనే పౌరసరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చ క‌చ‌కాల అడుగులు వేస్తున్న‌ది. దీనిపై తాజాగా ముఖ్య‌మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీనీ అన్నిజిల్లాల్లో అమలు చేసే అంశంపై అధికారుల‌తో చ‌ర్చించారు. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న బియ్యం,నిల్వల వివరాలను తెలుసుకున్నారు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్‌, రబీలో పంట ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులో ఉన్న‌ట్లు గుర్తించారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల నుంచి సేకరించిన బియ్యం నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు.

ఏప్రిల్‌ 1 నుంచి 22 నియోజకవర్గాల్లో, మే నాటికి 46, జూన్‌నాటికి 70, జులై నాటికి 106, ఆగస్టు నాటికి 175 మొత్తం నియోజకవర్గాల్లో ప్యాక్‌చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభించాల‌ని దిశానిర్దేశం చేశారు. అందు కోసం ప్రతీ 30–40 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకేజీ యూనిట్ చొప్పున మొత్త‌గా 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్‌ యూనిట్ల‌ను ఏర్పాటు చేయనుండ‌గా, అదులో 41 సివిల్‌ సప్లైస్‌వి, మరో 58 చోట్ల పీపీపీ మోడల్ యూనిట్లు. తొలివిడ‌త‌గా నెలకు 2వేల టన్నుల బియ్యాన్ని ప్యాకేజీ చేసే సామర్థ్యం ఉండే యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సత్వర పంపిణీ కోసం సిబ్బందిని, వాహనాల‌ను ముందుగానే గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

Tags: ap cm jaganmohan reddy, civil supply officers, review on ration