నాగ‌శౌర్య అశ్వ‌థ్థామ సినిమా రివ్యూ..

ప్రమోషనల్ కంటెంట్‌తోనే బావుంద‌నే ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న సినిమాల్లో ‘అశ్వథ్థామ ఒక‌టి. ప్రస్తుతం సమాజంలో స్త్రీలపై జ‌రుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలను చూసి చలించి హీరో నాగశౌర్య స్వయంగా రాసుకున్న కథతో తెరకెక్కించిన సినిమా ఇది. టీజర్ నుంచే ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తిని రేపింది ఈ చిత్రం. సినిమా టీమ్ ప్రమోషన్ల‌లో సైతం అదే విష‌యాన్ని పదే పదే అదే చెబుతూ వచ్చింది. ఇక హీరో నాగ శౌర్య తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ చెరిపేసుకుని అన్నిరకాల సినిమాల‌ను ,చేయ‌గలను అని తనని తాను ప్రోజెక్ట్ చేసుకోవాలనే పట్టుదలతో సొంత బ్యానరైన ఐరా క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంది?, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?, ఆ ఎమోషనల్ జర్నీ ఏ రీతిలో సాగింది? అనేది విశ్లేషించుకుందాం.

సినిమా కథ విషయానికి వస్తే గణ (నాగశౌర్య) కి తన చెల్లి ప్రియ అంటే ప్రాణం. చెల్లికి కూడా అన్నంటే అమిత‌మైన ఇష్టం. నిశ్చితార్థం జ‌రిగిన అనంత‌రం అంద‌రూ ఆనందంగా ఉన్న వేళ ప్రియకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. అది గ‌మ‌నించిన అన్న గ‌ణ అడ్డుకుంటాడు. విష‌యాల‌ను తెలుసుకుంటాడు. తాను ప్రెగ్నెంట‌ని, కానీ అది ఎలా జరిగిందో తనకు తెలియద‌ని ప్రియ చెప్ప‌డం ట్విస్ట్‌. ఆ త‌రువాత చెల్లికి అబార్షన్ చేయించి, పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తాడు గణ. మ‌రి ప్రియ గ‌ర్భానికి కారణం ఎవరు? అది తెలుసుకునే క్రమంలో ఎదురైన స‌వాళ్లు ఏమిటీ? వాటిని ఎలా అధిగ‌మించాడు? చివరకు ఏం జ‌రిగిందనేది క‌థ‌.

కమర్షియల్ సినిమా వేరు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వేరు. ఆ రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ సినిమా తీయ‌డం కష్టంతో కూడుకున్న‌దే అయినా, అందులో విజయవంతమైతే ఆ చిత్రం మామూలుగా ఉండదు. అదే ప్ర‌య‌త్నం చేసింది ‘అశ్వథ్థామ’ టీమ్ కూడా . సమాజంలోని ఒక బర్నింగ్ పాయింట్ చుట్టూ యాక్షన్ బ్యాక్ డ్రాప్తో క‌థ‌ను అల్లుకుని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఎత్తుగ‌డ‌లో విఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తున్న‌ది. చిత్రం మొదలవ్వడమే అన్న, చెల్లి సెంటిమెంట్ మీద మొదల‌వ‌డం, అసలు స్టోరీలోకి వెళ్ళడానికి రీళ్ల‌కు రీళ్ల‌ను లాగేయ‌డం, ఆ లోపాన్ని భ‌ర్తీ చేసే స్థాయిలో త‌గిన సన్నివేశాలు లేక‌పోవ‌డంతో సినిమా చాలా స్లోగా కదిలిన ఫీలింగ్ వస్తుంది ప్రేక్ష‌కుడికి. అన్న‌, చెల్లి మధ్య చూపించిన ఎమోషన్ కూడా చాలా రొటీన్‌గా ఉండ‌డంతో మొద‌టి ముప్పావుగంట బోరింగ్‌గా న‌డుస్తుంది క‌థ‌. ఇక ఈ మధ్యలో వచ్చే హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ స‌న్నివేశాలు కూడా బలవంతగా జొప్పించిన‌ ప్రయత్నంలా నే అనిపిస్తుంది. చెల్లి గ‌ర్భానికి కార‌ణ‌మైన విలన్ ని వెదుకుతూ గ‌ణ వెళ్ళే ప్రాసెస్ కాస్త ఉత్సుక‌త‌ను రేకేత్తిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అది సెకండాఫ్ మీద భారీ అంచనాల‌ను రేపుతుంది. అయితే సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే విలన్‌ని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ ఆ సస్పెన్స్‌ని మైంటైన్ చెయ్యడంలో అంతగా ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌లేద‌ని చెప్ప‌వ‌చ్చు. హీరో ఇన్వెస్టిగేషన్ చాలా కన్వీనియంట్‌గా సాగుతుంది. విలన్ ఎవరో తెలిసిపోవడం, ఆ విలన్‌ని పట్టుకోవడానికి హీరో వేసే ప్లాన్స్ చాలా వీక్‌గా ఉండడంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. క్లైమాక్స్ కూడా చాలా సాదాసీదాగా ఉంది. మొత్తంగా ముందు చెప్పుకున్నట్టే సోషల్ మెసేజ్‌ని, కమర్షియాలిటీని బ్లెండ్ చెయ్యడంలో దర్శకుని అనుభవలేమి చాలా చోట్ల అద్దం ప‌డుతుంది. మొత్తంగా అశ్వథ్థామ సాదా సీదా సినిమాగానే అనిపిస్తుంది.

సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్ని తానై న‌డింపిన నాగ శౌర్య కష్టం తెరపై కనిపించింది. త‌న‌లోని మ‌రో న‌ట‌న కోణాన్ని ఆవిష్క‌రించాడు. కానీ ఈ ల‌వ‌ర్ బాయ్‌ను ఒకేసారి అంత యాక్షన్ మోడ్‌లో చూడడం కాస్త కష్టమే అనిపిస్తుంది. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే సినిమాకు ఆమె అవసర‌మే లేద‌ని చెప్ప‌వ‌చ్చు. కమర్షియల్ ఫార్ములా, సేలబులిటీ అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ పాత్రని బ‌ల‌వంతంగా సృష్టించి కథలో ఇరికించార‌ని అర్ధమవుతుంది. ఆ పాత్రకి పెద్దగా కష్టపడకుండా తనకు వచ్చిన నటనతో మేనేజ్ చేసింది మెహ్రీన్. ఇక విలన్ పాత్రలో తెలుగు తెరకి పరిచయమయిన బెంగాలీ యాక్టర్ బాగానే చేశాడు. అయితే మామూలు సైకో విలన్ గానే చూపించారు తప్ప అతని పాత్రకి వేరే ప్రత్యేకత ఏమీ లేకుండా పోయింది. మిగతా నటీనటులంతా పాత్రలపరిధిమేర డీసెంట్‌గా నటించారు. డైరెక్టర్ రమణ తేజ నాగ శౌర్య రాసుకున్న కథలో ఎక్క‌డా ఇన్‌వాల్వ్ కాలేద‌ని అనిపిస్తుంది. త‌న మార్క్‌ను చూపించే ప్ర‌య‌త్నం ఏమీ చేయ‌లేదు. శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు ఫ‌ర్వాలేద‌నిపించింది. జిబ్రాన్ నేపథ్య‌ సంగీతం బావుంది. సినిమా కంటెంట్‌ని ఎలివేట్ చేయ‌గ‌లిగింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కష్టం కనిపిస్తుంది. మొత్తంగా నాగ శౌర్య త‌న‌ ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు.

Tags: ashwathama movie riview, Ira Creations, lyrics sricharan pakala, manojreddy, mehrin, nagashourya, ramanateja, zebran music