పార్టీ ఎంత నష్టపోతున్న టిడిపి అధినేత చంద్రబాబు కొన్ని విషయాలలో మారటం లేదన్న అసంతృప్తి పార్టీ వీరాభిమానుల్లోనూ.. కార్యకర్తల్లోనూ ఉంది. పార్టీ కోసం ఎప్పటినుంచో కష్టపడుతున్న వారిని కాదని పలు పార్టీలు మారి కండువాలు మార్చి వచ్చిన వారికి చంద్రబాబు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు గత ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయాక నాలుగున్నర సంవత్సరాల పాటు అడ్రస్ లేకుండా పోయి.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు మొదలయ్యాక చాలామంది నేతలు యాక్టివ్ అవుతున్నారు.
ఈ నాలుగేళ్లు కేసులు ఎదుర్కొని గ్రౌండ్ లెవల్లో ఫైట్ చేసిన నాయకులను కాదని… ఇప్పటి వరకు కలుగుల్లో దాక్కొని ఇప్పుడు బయటకు వస్తోన్న నేతలకే రేపు గెలిచిన వెంటనే మంత్రి పదవులు కట్టబెడతారన్న వార్తలు వస్తుండటంతో సగటు టిడిపి కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి.. అసహనాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు తమ నియోజకవర్గాల్లో పదేపదే చిత్తుచిత్తుగా ఓడిపోతూ పార్టీకి భారంగా మారుతున్నారు. ఇలాంటి నేతల వల్ల పార్టీకి ఎంత మాత్రం ఉపయోగం లేదు. అయినా ఇంకా ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి నేతలలో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఒకరు.
నిజానికి ముద్రబోయిన ఇప్పటికే అవుట్ డేటెడ్ పొలిటికల్ లీడర్ అని చెప్పాలి. ఎప్పుడో 2004లో వైయస్ గాలిలో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా గన్నవరంలో 17వేల ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థిపై చిత్తుగా ఓడిపోయారు. 2014 ఎన్నికలలో నూజివీడులో బీసీ అభ్యర్థి కోసం తెలుగుదేశం వెతుకుతున్న సమయంలో ముద్రబోయిన చివరలో కండువా మార్చి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మద్దరబోయిన ఎమ్మెల్యేగా గెలవలేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉండి కూడా పార్టీని ఏ మాత్రం బలపరచలేదు సరికదా.. గత ఎన్నికల్లో మరీ ఘోరంగా ఓడిపోయారు.
ఈ సారి కూడా వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ కావాలని ముద్రబోయిన అంటున్నా… ఈ సారి కూడా ఆయనకే సీటు ఇస్తే నూజివీడు సీటుపై టీడీపీ గ్యారెంటీగా ఆశలు వదులుకోవాల్సిందే. ఈ మాట టీడీపీ హార్ట్‌కోర్ అభిమానులే అంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆయన పార్టీని నియోజకవర్గంలో ఇంచ్ కూడా బలోపేతం చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలో అన్ని వర్గాలను… అందరిని కలుపుకు పోయే పరిస్థితి లేదని పార్టీ కేడర్ గగ్గోలు పెడుతోంది. ముద్దరబోయినకు కాకుండా అక్కడ ఆశావాహులుగా ఉన్నవాళ్లలో ఎవరికి సీటు ఇచ్చినా నూజివీడులో టీడీపీ ఈజీగా గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
పోని బీసీలకే సీటు ఇవ్వాలని అధిష్టానం అనుకుంటే మరో బీసీ నేతకు ఇచ్చినా ఇక్కడ పార్టీ కేడర్ కసితో పని చేసి సీటు గెలిపించుకుంటామంటోందే తప్పా… ముద్దరబోయినకు ఇస్తే అసలు నామినేషన్ కూడా వేయకుండానే పార్టీ ఓటమి రాసిపెట్టుకోవచ్చన్న చర్చ పార్టీలోనే జరుగుతోంది. ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా నూజివీడులో టీడీపీ పుంజుకోలేదంటే ముద్దరబోయినపై వ్యతిరేకత ఎలా ఉందో తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా లోకేష్ యువగళం పాదయాత్ర విషయంలో కూడా అసలు నా నియోజకవర్గంలో పాదయాత్ర వద్దు… ఏదీ వద్దు… గన్నవరం నియోజకవర్గం నుంచి డైరెక్టుగా చింతలపూడిలో పెట్టేసుకోండని తన నిస్సహాయత వ్యక్తం చేశారని టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. అసలు నియోజకవర్గ కేడర్‌లో మెజార్టీ ఆయన వెంట వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు లోకేష్ పాదయాత్ర వద్దు… రేపు టిక్కెట్ నాకే కావాలి… నేను ఓడిపోయినా పార్టీ ఎలాగూ అధికారంలోకి వస్తుంది.. నేనే ఇన్‌చార్జ్‌గా ఉంటానని అన్నట్టు కూడా టాక్ బయటకు వచ్చింది.
ముద్దరబోయినను ఇంకా కంటిన్యూ చేస్తే.. అసలు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నేతలు ఇలానే ఆలోచిస్తే అసలు ఇంక పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా ? చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి అవుతారా అన్నది అధిష్టానం ఆలోచించుకోవాల్సిన టైం ఆసన్నమైంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి నేతలను ఈ సారి పక్కన పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది.