శనగలు, బియ్యం నానబెట్టి చేసుకునే దోస రుచిలో భిన్నంగా బాగుంటుంది. అల్పాహారం లోకి దోసెలు ఉంటే కడుపు నిండిపోతుంది. కానీ వారానికి ఒక్కసారి తినగలుగుతాం. అలాంటప్పుడు రుచిలో భిన్నంగా ఉండే ప్రోటీన్ ఎక్కువ ఉండే శనగలతో దోశ చేసుకుని తినవచ్చు. దీనికి మినప్పప్పు కూడా అవసరం లేదు. పిండి పులియబెట్టకున్నా కూడా దోస వెంటనే వేసుకోవచ్చు.
పులిసిన పిండిని వేసుకుంటే రుచి ఇంకాస్త పెరుగుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం, ఒక కప్పు నల్ల సెనగలు, ఒక కరివేపాకు రెబ్బ, రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, రెండు చెంచాల పచ్చి కొబ్బరి, సగం టీ స్పూన్ మెంతులు, తగినంత ఉప్పు, రెండు చెంచాల నూనె
తయారీ విధానం: ముందుగా పెద్ద గిన్నెలో శనగలు, బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కుని మునిగే అంతా నీళ్లు పోయాలి. అందులోని మెంతులు కూడా వెయ్యాలి. వీటిని 8 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మిక్సీ జార్ లో వేసి పిండి చేయాలి. ఆ తర్వాత పెనం పెట్టుకుని వేడెక్కాక దోసల లాగా వేసుకోవాలి. అంచుల నెంబడి నూనె పోసుకుని కాల్చాలి. రెండు వేపుల రంగు మారేదాకా దోస కాల్చుకుంటే చాలు. దీన్ని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.