3 రాజధానులపై మూడు మాటల జగన్…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశంపై విజయవాడలోని గేట్ వే హోటల్ లో జరిగిన ఒక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఎంతో అభివృద్ధి చెందిన నగరం అని, అక్కడ అభివృద్ధి చేస్తే బెంగళూరు, ముంబై, హైదరాబాద్ సరసన విశాఖ నిలుస్తుంది అంటూ జగన్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ అని కూడా జగన్ మాట్లాడారు.

వాస్తవానికి ఆ మాటలు చాలా మందికి అర్ధం కాలేదు. మూడు రాజధానుల విషయంలో జగన్ ముందు నుంచి పట్టుదలగా ఉన్నారు. ఎవరు ఆపినా అడ్డుకున్నా వద్దన్నా సరే రాజధాని అనేది విశాఖకు వెళ్ళాల్సిందే అనేది జగన్ పట్టుదల. అందుకోసం ఇప్పటికే పలు కార్యాలయాలను కూడా ఆయన విశాఖకు తరలించడానికి అన్ని విధాలుగా కూడా సిద్దమైన సంగతి తెలిసిందే.

అది బాగానే ఉంది గాని… ఇప్పుడు విశాఖ ఎంతో అభివృద్ధి చెందింది అన్నారు. సరే విశాఖ అభివృద్ధి జరిగినప్పుడు అక్కడ మరో 10 వేల కోట్లు ఖర్చు చేయడం ఎందుకు…? మరి అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా అవుతుంది…? అసలు అభివృద్ధి జరిగిన నగరంలో మళ్ళీ అభివృద్ధి ఎందుకు…? దీనికి జగన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సరే అది అలా ఉంచితే మరో మాట ఏంటీ అంటే… అమరావతికి లక్ష కోట్లు అవుతాయి కాబట్టి విశాఖ వెళ్తున్నాం, అక్కడ అన్నీ ఉన్నాయి… అమరావతిని అభివృద్ధి చేస్తాం అన్నారు. అక్కడ పరిపాలనకు సంబంధించి ఒక్కటి కూడా లేదు. అమరావతిలో ప్రతీ భవనం ఉంది. రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించుకుని, ఆ పది వేల కోట్లు ఏదో ఇంకో ప్రాంతానికి ఖర్చు చేయవచ్చు కదా…?

అమరావతిని అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు అన్నప్పుడు మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పడం ఏంటీ…? అసలు విశాఖకు రాజధాని ఎందుకు అనేది జగన్ కి కూడా ఒక స్పష్టత అనేది కనపడట౦ లేదు. మూడు కాళ్ళు కుందేలుకి అనే విధంగానే జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి మినహా ఆయన ఇచ్చిన సరైన వివరణ లేదు, పరిశీలకులకు కూడా అది ఏంటీ అనేది అర్ధం కాని పరిస్థితి.

Tags: 3 Capitals, AP, YS Jagan, ysrcp