జగన్ నినాదం ..అప్పు చేసి పప్పు కూడు…!

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతుందని ప్రజలు సంతోషంగా ఉన్నారని అధికార పార్టీ పదే పదే చెప్తూ వస్తుంది. అయితే అందులో వాస్తవాలు, దాని వలన జరగబోయే నష్టాల గురించి మాత్రం మాట్లాడే పరిస్థితి ఎక్కడా లేదూ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వేల కోట్ల రూపాయల అప్పులను చేసిన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరిట వెచ్చించడం అనేది ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేటలో పడటం ఆందోళన కలిగిస్తుంది. అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా రాష్ట్ర పరిస్థితి ఉంది అనేది వాస్తవం. రాజకీయ లక్ష్యాల కోసం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వెళ్తున్న జగన్ తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఇక తాజాగా మరో 7 నుంచి 9 వేల కోట్ల వరకు అప్పులను సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

గత 10 నెలల్లో రూ.47,100 కోట్లు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన మరో 2 నెలలకు గాని ఇంకో రూ.7,000 కోట్లు అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనితో ఇప్పుడు ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పులకు సంబంధించిన వివరాల కోసం ఆర్ధిక శాఖ లెక్కలను కూడా సమర్పించింది.

గత ఏడాది బడ్జెట్‌ అంచనాల ప్రకారం చూస్తే, ప్రస్తుత 2019-20 ఆర్ధిక ఏడాదిలో రూ.35,260 కోట్లు మార్కెట్‌ నుంచి బహిరంగ రుణం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అంచనాలు వేసారు. రూ.32 వేల కోట్ల రుణానికి గాను మొదటి 9 నెలలకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్ధిక గత డిసెంబరులో రూ.15 వేల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి అనుమతి కావాలని కేంద్రాన్ని కోరింది.

ఇప్పటి వరకు అయిన అప్పు పరంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు వేల కోట్లు మాత్రమె ఋణం సమీకరించుకునే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చొరవతో రాష్ట్ర ప్రభుత్వానికి జనవరిలో రూ.7,428 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతించింది. ఇందులో దాదాపు రూ.5 వేల కోట్ల వరకు జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది. దీని ఆధారంగా చూస్తే రూ.2,000 కోట్లకు మాత్రమె అవకాశం ఉంది.

తాము డిసెంబరులో రూ.15,000 కోట్ల రుణానికి అనుమతి అడిగామని, అందులో రూ.7,428 కోట్లకు మాత్రమే కేంద్రం అనుమతులు ఇచ్చిందని, తాము మిగతా రూ.7,000 కోట్లు తెచ్చుకోవడానికీ అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. దీనికి కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతులు ఇస్తే మాత్రం, ఒక ఆర్ధిక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.56,000 కోట్లు అప్పులు చేసింది అన్న మాట.

2019 ఏప్రిల్‌ నుంచి 2020 జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.37,100 కోట్లు, ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌ విధానంలో రూ.10,000 కోట్లు అప్పు చేసింది. మొత్తం కలిసి రూ.47,100 కోట్లకు చేసింది. అప్పు చేసి పప్పు కూడు ఎందుకు పెడుతున్నారో…? అసలు అన్ని వేల కోట్లను ఏ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందో…? వాటిని ఏ విధంగా తీరుస్తారో…?

Tags: AP, Loan, welfare schemes, YS Jagan, ysrcp