టీఆర్ఎస్‌, వైసీపీల్లో రాజ్య‌స‌భ చిచ్చు..!

తెలుగు రాష్ర్టాల్లోని అధికార పార్టీల‌యిన టీఆర్ెస్‌, అటు వైసీపీల‌కు కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. రాజ్య‌స‌భ స్థానాల‌కు ఆశావ‌హుల పోటీ ఎక్కువైంది. త‌మ‌కంటే త‌మ‌కు అంటూ కిందిస్థాయి నేత‌లు, ప‌లువురు పార్టీ ముఖ్య‌నేత‌లు కూడా ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికే త‌మ సామాజిక కార్డుల‌ను వినియోగించుకుంటూ పార్టీ పెద్ద‌ల‌పై ఒత్తిడి పెంచుతున్నారు. కొంద‌రు గ‌తంలో త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను సైతం గుర్తు చేస్తున్నారు. ఇలా ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. దీంతో త్వ‌రలో రాష్ర్టంలో ఖాళీ కాబోయే నాలుగు స్థానాల్లో ఎవ‌రు నామినేట్ అవుతారా? అన్న ఉత్కంఠ‌త నెల‌కొన్న‌ది.

ఏప్రిల్‌లో తెలుగు రాష్ర్టాల్లో క‌లిపి మొత్తంగా 6 స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏపీలో 4, తెలంగాణ‌లో రెండు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎన్నిక ప్ర‌క్రియ‌ను మార్చి 26న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవ‌లే ప్రకటించింది. దీంతో ఆ దిశ‌గా ఆయా పార్టీల్లోని నేత‌లు చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్నారు. అందులో పార్టీకి మొద‌టి నుంచి అండ‌గా నిల‌బ‌దుతున్న నేత‌లు, గ‌త ఎన్నిక‌ల్లో త‌మ సిట్టింగ్ స్థానాలను పార్టీ నిర్ణ‌యం మేర‌కు త్యాగం చేసిన అప్ప‌టి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వారంతా ఇప్పుడు అధినాయ‌క‌త్వం వైపు ఆశ‌గా చూస్తున్నారు. మ‌రోవైపు ఖాళీ అవుతున్న స్థానాల‌కు ఇప్ప‌టికే ప‌లువురు పేర్లు ఖ‌రారైన‌ట్లు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. దీంతో ఆ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఎక్క‌డ త‌మ పేర్లు గ‌ల్లంత‌వుతాయోన‌ని కంటి మీద కునుకు లేకుండా త‌మ ప్ర‌య‌త్నాలను ముమ్మ‌రం చేశార‌ని సొంత పార్టీల్లోని నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఏపీలో ఖాళీ కానున్న నాలుగు స్థానాల‌కు సంబంధించి వైసీపీ తరపున ఇప్ప‌టికే పలువురి పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో మెగ‌స్టార్‌ చిరంజీవి, జ‌గ‌న్ సోద‌రి షర్మిల, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా పలువురు ఈ రేసులో ఉన్నారనే టాక్. ఇక్క‌డే అస‌లు వ‌చ్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చాలా మందికి ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తామ‌ని, పోటీ నుంచి విర‌మించుకోవాల‌ని, లేదంటే వైసీపీలో చేరాని జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇచ్చారు. అధికారం చేప‌ట్టిన ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారింది. విప‌క్ష టీడీపీ శాస‌న మండ‌లి కేంద్రంగా ఇరుకున పెడుతుండ‌డంతో ఏకంగా దానిని ర‌ద్దు చేస్తూ తీర్మానం చేశారు. దీంతో శాస‌న మండ‌లి ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో నాడు త‌మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆశించిన వారంతా ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌రోవైపు ఏద‌యినా స‌రే క‌నీసం రాజ్య‌స‌భ స్థానాన్ని అయినా పొందాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. దీంతో ఒక్క‌సారిగా అధికార వైసీపీకి రాజ్య‌స‌భ స్థానాల కోసం పోటీ పెరిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు. నలుగురులో ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక ఓసీని ప్రాతిప‌దిక‌న ఎంపిక చేయాలని వైసీపీ ముఖ్యనేతలు భావిస్తుండ‌గా, మొత్తానికి వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నిక కాబోయే ఆ నేతలు ఎవ‌న్న అంశంపై ఉత్కంఠ‌త నెల‌కొంది.

ఇక తెలంగాణ రాష్ర్టంలో అధికార టీఆర్ ఎస్ పార్టీలోనూ ఇంచు మించు ఇదే ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. రాష్ర్టంలో ఖాళీ కానున్న రెండు స్థానాలు ప‌క్కాగా గులాబీ ఖాతాకే చేరుతాయి. అయితే ఆ స్థానాలు ఎవ‌రిని వ‌రిస్తాయ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇందులో ఇప్ప‌టికే ప‌లువురు పేర్లు ఇప్ప‌టికే అధినేత కేసీఆర్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. వారిలో గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌న సిట్టింగ్ స్థానాన్ని త్యాగాన్ని చేసిన ఖ‌మ్మం నాయ‌కుడు పొంగులేటి శ్రీ‌నివాస్ పేరు దాదాపు నిర్ణ‌య‌మైపోయిన‌ట్లుగా వినిపిస్తున్న‌ది. మ‌రొక సీటును ఎస్సీ, లేదా ఎస్టీ స‌మాజిక వ‌ర్గానికి కేటాయించాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే రాజ్య‌స‌భ సీటు కోసం నిజామాబాద్ మాజీ ఎంపీ, త‌న‌య‌ క‌విత ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇంట్లోనూ ఇదే విష‌య‌మై పోరు సాగుతున్న‌ట్లు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా ఇబ్బందులు ఎదురవుతాయ‌న్న ఉద్దేశంతో గులాబీ బాస్ అందుకు నిరాక‌రిస్తున్నార‌ని, మ‌రోవైపు సీటు కేటాయించార‌నే బిన్న ర‌కాలుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో ఆ రెండు స్థానాల‌పైనా ఉత్కంఠ‌త నెల‌కొన్న‌ది.

Tags: cms jagan mohanreddy, kavitha, kcr, trs, ys sharmila, ysrcp