అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను తవ్వితీయడం మొదలు పెట్టాడు ముఖ్యమంత్రి జగన్. దాని కోసం ఏకంగా కెబినెట్ సబ్ కమిటీని, సిట్‌లను ప్రత్యేకంగా నియమించాడు. మరోవైపు గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగి ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులపైనా ఆయన దృష్టి సారించారు. ఒక్కొక్కరిపైనా చర్యలు తీసుకునేందుకు ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా మొట్టమొదటగా ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన, ఐఆర్ ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై ఏపీ ప్రభుత్వం వేటు వేసి సంగతి తెలిసింది. అప్పటి ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగాలు రాగా, ఏపీ సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అనంతరం ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవలే ఐబీ డీఐజీ ఏబీ వెంకటేశ్వర్‌రావును సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే మరికొందరి అధికారులపైన దృష్టి సారించింది.
ఇదిలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం కావాలని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది సదరు అధికారులు ఆరోపిస్తున్నారు. తమ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. వాటిపై విచారణ జరిపిన అధికారులు ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్‌ను క్యాట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ట్రిబ్యునల్ ఆదేశాలను జారీ చేయడంతో ఏపీ సీఎం జగన్‌ను ఎదురుదెబ్బ తగిలింది. అదేవిధంగా కృష్ణకిషోర్‌పై ఉన్న కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చని క్యాట్ సూచించింది. ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా క్యాట్ తీర్పునివ్వడంతో వైసీపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. అదేవిధంగా సస్పెండ్‌కు గురైనా ఐబీ వెంకటేశ్వర్‌రావు కూడా క్యాట్‌ను ఆశ్రయించారు. ఆ కేసు ట్రిబ్యునల్ విచారణలో ఉంది. అందులోనూ ఇలాంటి తీర్పే వస్తే కష్టమేనని సర్కారు భావిస్తున్నది.