ఏపీకి మూడు రాజధానులు….ప్రస్తుతం ఏపీలో బాగా హాట్‌గా చర్చ జరుగుతున్న టాపిక్ ఇదే. అసలు రాజధాని అమరావతి నిర్మాణాన్ని గాలికొదిలేసి…కొన్ని రోజులుగా అనిశ్చితి వాతావరణం కొనసాగించిన జగన్ ప్రభుత్వం హఠాత్తుగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తెచ్చారు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుని జ్యుడీషియల్ క్యాపిటల్‌గా చేసే అవకాశముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు.
ఇక ఈయన ప్రకటన చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏ విధంగా మూడు రాజధానులు చేస్తారంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఇది సాధ్యమయ్యే పనేనా లేక ఓ తుగ్లక్ చర్య లాంటి ప్రకటన అని జనం చర్చించుకుంటున్నారు. ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ చెప్పే ముందు జగన్ దక్షిణాఫ్రికాని ఉదాహరణగా చెప్పారు. ఆ దేశానికి ప్రిటోరియా, కేప్‌టౌన్, బ్లోమ్‌ఫాంటేన్.. రాజధానులుగా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా ఉన్న ప్రిటోరియాలో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల కార్యాలయాలు ఉన్నాయి. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా ఉన్న కేప్‌టౌన్‌లో చట్టసభలు మాత్రమే ఉన్నాయి. ఇక జ్యుడిషియల్ క్యాపిటల్‌గా బ్లోమ్‌ఫాంటేన్‌లో ఆ దేశ సుప్రీంకోర్టు ఉంటుంది.
అలాగే మన రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా పరిపాలనా వ్యవహారాలు (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), అమరావతి కేంద్రంగా శాసన వ్యవహారాలు (లెజిస్లేటివ్ క్యాపిటల్), కర్నూల్ కేంద్రంగా న్యాయ సంబంధిత వ్యవహారాలు (జ్యుడిషియల్ క్యాపిటల్) నిర్వహించాలని జగన్ అనుకుంటున్నారు. అయితే ఏ మాత్రం సాధ్యమయ్యే పని కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే బాగుటుంది గానీ…అధికార వికేంద్రీకరణ జరిగితే రాష్ట్ర పరిస్తితి అధోగతి పాలవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇలా జరగడం వల్ల తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని దక్షిణాఫ్రికా దేశం పలు సందర్భాల్లో చెప్పింది. ఇలా మూడు చోట్ల కంటే ఒకచోట నుంచే అడ్మినిస్ట్రేషన్ కొనసాగితే బాగుంటుందని చెబుతుంది.
అయితే అక్కడ విఫలమైన ఫార్ములాని జగన్ ఏపీలో ఎలా అమలు చేయాలని అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. మామూలుగా అసెంబ్లీ అమరావతిలో ఉంటే సమావేశాలు జరిగే అన్నీ రోజులు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం, ప్రతిపక్ష నేత ఇక్కడ ఉండాలి. ఇక పాలన వ్యవహారాలు వస్తే విశాఖకు పరిగెత్తాలి. ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా వాళ్ళు హైకోర్టుకు వెళ్లాలంటే కర్నూలు పోవాలి. అటు రాయలసీమ వాళ్ళు ఏమన్నా పని ఉంటే విశాఖకు వెళ్ళాలి. ఇది చాలా వ్యయప్రయసాలకు గురిచేసే పని. ఇక ఈ రెండిటి మధ్యలో అమరావతి పాత్ర నామమాత్రమే అవుతుంది. దీని వల్ల అమరావతి చుట్టూ పక్కల ఉండే ప్రజలు అసంతృప్తికి లోనవ్వడం ఖాయం.
ఈ పరిస్తితిలన్నీ చూసుకుంటే మూడు రాజధానులు ఏర్పాటు అనేది పెద్ద తుగ్లక్ చర్యగానే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ జగన్ ఉత్తిగా ఏమి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినట్లు కనిపించడం లేదు. అమరావతి అనేది టీడీపీకి బ్రాండ్‌లా ఉంటుంది. దాన్ని తగ్గించాలంటే ఈ విధంగా మూడు రాజధానులు తీసుకొస్తే అమరావతి విలువ కోల్పోతుంది. అటు వైసీపీ విశాఖలో వీక్‌గా ఉంది. మొన్న ఎన్నికల్లో నగరంలో నాలుగు సీట్లు టీడీపీనే గెలుచుకుంది. ఇక త్వరలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రానున్నాయి. ఇప్పుడు ఈ ప్రకటన చేయడం వల్ల తమ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ ప్రకటన వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు.