జ‌గ‌న్‌కు హైకోర్టుకు మ‌రో షాక్‌..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహ‌లం నెలకొన్న‌ది. ఇప్ప‌టికే నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొన‌సాగుతున్న‌ది. అధికార వైసీపీకి చెందిన నాయ‌కులు నామినేష‌న్ల‌ను భారీగానే దాఖ‌లు చేస్తున్నారు. గెలుపు ధీమాతో నాయ‌కులు ముందుకు సాగుతున్నారు. స‌రిగ్గా ఇదే త‌రుణంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి స‌ర్కారు హైకోర్టు మ‌రోసారి అక్షింత‌లు వేసింది.  ఇప్ప‌టికే ప‌లు జీవోలు, వివాదాస్ప‌ద అంశాల‌పై హైకోర్టు మండిప‌డింది. తాజా మ‌రోసారి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను త‌ప్పు ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు వేయడాన్ని త‌ప్పుబ‌ట్టింది.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. గుంటూరు జిల్లా ప‌ర్ల‌పాడు గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి వైసీపీ పార్టీ రంగులు వేయడంపై అభ్యంత‌రం తెలుపుతూ గ్రామానికి చెందిన టీడీపీ నాయ‌కుడు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని విచారించిన న్యాయం స్థానం ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను త‌ప్పుప‌ట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. వెంటనే పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల్లోగా మళ్లీ రంగులు వేయాలని, ఆధారాలతో సహా నివేదిక రూపంలో సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వైసీపీ జెండా రంగు తరహా రంగులు వేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమోను రద్దు చేయ‌డం గ‌మ‌నార్హం. స్కూళ్లు, పంచాయతీ కార్యాలయాలు, వాటర్‌ ట్యాంకులకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లే. అటు.. స్థానిక సంస్థలు ఎన్నికలను ఈసీ నిష్పక్షపాతంగా నిర్వహించాలని హైకోర్టు సూచించ‌డం కొస‌మెరుపు.

Tags: AP, HighCourt, Party Colours, verdict, YS Jagan, ysrcp