ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకా ఎన్నికల సమయం రానేలేదు. ఇప్పటినుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి త్వరలోనే తమ అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించే అవకాశం ఉంది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చేందుకు జగన్ ఇప్పటికే తలూపారు. అయితే జగన్ నుంచి కొందరికి మాత్రం ఇంకా టిక్కెట్లు కేటాయించే విషయంలో హామీ రానట్టు తెలుస్తోంది.
అందులోనే కీలకమైన విజయవాడకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు వైసిపి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో కాదు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ ఇద్దరు నాయకులను అధిష్టానం ఎందుకు హోల్డ్ లో పెట్టిందో… అర్థం కావడం లేదు. విచిత్రం ఏమిటంటే గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడి ఎన్నికల తర్వాత వైసిపి లోకి వచ్చిన పార్టీ యువనేత దేవినేని అవినాష్‌కు ఇప్పటికే విజయవాడ తూర్పు టికెట్ కేటాయించింది.
తాజాగా విజయవాడ నగరంలో హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన జగన్ ప్రత్యేకంగా అవినాష్ ఇంటికి వెళ్లి మరి దాదాపు అరగంటకు పైగా గడిపారు. అవినాష్ కు సైతం వచ్చే ఎన్నికలలో టిక్కెట్ నీకే ఖరారు చేశాను.. చాలా జాగ్రత్తగా పని చేసుకుని గెలిచిరా అని చెప్పినట్టు తెలుస్తోంది. అదే సమయంలో విష్ణు- వెల్లంపల్లికి మాత్రం ఇంకా ఎందుకు ? లైన్ క్లియర్ చేయలేదు అన్న సందేహాలు నగర వైసిపి వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కేవలం ఈ ఇద్దరి నేతలపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే జగన్ వీరి టిక్కెట్లను పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది.