ఒకే ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానులు ఉండొచ్చనే ప్రకటనతో రాష్ట్రం మూడు ప్రాంతాలుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. నిదానంగా ప్రాంతీయ విద్వేషాలు కూడా చెలరేగేలా ఉన్నాయి. ఇప్పటికే జగన్ ప్రకటన వల్ల అమరావతి ప్రాంతం భగ్గుమంటుంటే…రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొంత సంతోష వాతావరణం కనిపిస్తుంది.
అసలు రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉన్న..పాలన విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు…వెంటనే విజయవాడకు వచ్చి అక్కడే దగ్గరలో ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటనని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఒప్పుకున్నారు. తర్వాత చంద్రబాబు మీద నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసమని చెప్పి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు.
ఇక భూసమీకరణ కింద భూములు తీసుకుని చంద్రబాబు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు లాంటివి నిర్మాణాలు చేశారు. అలాగే పలు పాలన పరమైన బిల్డింగుల నిర్మాణం కూడా మొదలుపెట్టారు.
ఇక ఈలోపు 2019 ఎన్నికల రావడం…జగన్ సీఎం అవ్వడంతో అమరావతి పరిస్తితి సందిగ్ధంలో పడింది. ఆరు నెలలు ఈ సందిగ్ధతని కొనసాగించిన…ఒక్కసారిగా మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు. అసెంబ్లీ వ్యవహారాలు అమరావతిలో, పాలన వ్యవహారాలు విశాఖపట్నంలో, న్యాయపరంగా సంబంధీచిన వాటికోసం కర్నూలు ఉంటాయని ప్రకటించారు.
ఈ ప్రకటన వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అమరావతి చుట్టూ పక్కల ఉన్నవారు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఉంటే మొత్తం ఇక్కడే ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల వారికి జగన్ నిర్ణయం ఏ మాత్రం నచ్చలేదు. ఈ క్రమంలోనే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు అప్పుడే రోడ్లెక్కేశారు. జగన్ నిర్ణయంపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. రాజధాని ఇక్కడే కట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే వీరి డిమాండ్ పట్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. తమకు ఏదొక అవకాశం దక్కుతుంటే అడ్డు పడటం దేనికి అంటున్నారు. ఇక ప్రస్తుతానికి అమరావతి రైతులు మాత్రమే బయటకొచ్చారు. వారి ఆందోళన మరింత ఉదృతం అయితే అమరావతికి అటు ఇటు ఉన్న జిల్లాల ప్రజల కూడా రోడ్లెక్కే అవకాశముంది. వీరు ఆందోళన చేస్తే అటు సీమ, ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉద్యమించే అవకాశముంది. ఇలా ఒక రాష్ట్రంగా ఉన్న ఏపీ మూడుగా చీలిపోయి గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ పరిస్తితులు ఎటు వైపు దారి తీస్తాయో చూడాలి.