టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు.. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రెగ్యులర్ బెయిల్‌పై సందిగ్ధత వీడింది. చంద్రబాబుకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. స్కిల్ కార్పొరేషన్ అవినీతి కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు వెల్లడించింది. ఈ నెల 29 నుంచి బెయిల్‌కు అంతకుముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
అంతేకాదు.. ఈ నెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ ర్యాలీల్లో నేరుగా పాల్గొనవచ్చని హైకోర్టు పేర్కొంది. దీంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఇదే కేసులో కేసును పూర్తిగా క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ కేసులో తీర్పు రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. ఇక, చంద్రబాబుకు కోర్టుల పరంగా ఇబ్బంది తొలిగిపోయిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
కీలకమైన ఎన్నికల ముంగిట వైసీపీ వేసిన ఉచ్చు పటాపంచలు అయిపోయిందని.. తమ నాయకుడు యాక్టివ్ అవుతారని.. గతంలో మాదిరిగానే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకుంటారని చెబుతు న్నారు. చంద్రబాబు యాక్టివ్ అయితే.. ప్రస్తుతం నెలకొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా లభి స్తుందని చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేనతో కలిసి వెళ్లే అంశం కొన్ని జిల్లాల్లో ఇబ్బందిగా ఉంది. బాబు వాటిని పరిష్కరిస్తారని సీనియర్ నాయకులు చెబుతున్నారు.
మరోవైపు.. వైసీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూ.. ఎన్నికల వేళ చంద్రబాబు కంచు కంఠంతో ప్రజల మధ్యకు వస్తారని చెబుతున్నారు. ఇది తమకు ఎంతో లాభిస్తుందని అంటున్నారు. ఒకవైపు నారా లోకేష్ ఈ నెల 24 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తుండడం.. మరోవైపు చంద్రబాబు కూడా పుంజుకునే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. దీంతో వైసీపీ దూకుడుకు కళ్లెం పడుతుందని తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి టీడీపీకి పట్టిన చంద్రగ్రహణం వీడిందని చెబుతున్నారు.