ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఒకవైపు సొంత పార్టీలోను.. మరోవైపు ప్రజల్లోనూ మద్దిశెట్టికి వ్యతిరేకంగా రాజకీయాలు సాగుతున్నాయి. నియోజకవర్గంలో మచ్చుకు చూద్దామన్నా కూడా అభివృద్ధి కనిపించడం లేదని.. ఎప్పుడో టీడీపీ హయాంలో వేసిన రహదారులే ఇప్పటికీ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
అంతేకాదు.. ఎమ్మెల్యేను చూడాలని అంటే.. ముందుగా ఆయన సోదరుడి దర్శనం చేసుకోవాల్సి వస్తోం దని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇక, అధికార వర్గాలకు కూడా.. ఎమ్మెల్యే కంటే ఆయన సోదరుడే అందుబాటులో ఉంటున్నట్టు స్థానికంగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేకేవలం కొన్ని కొన్ని కార్యక్రమాలకే పరిమితం కావడం, అన్నీ ఆయన సోదరుడే చేస్తుండడంతో రాజకీయంగా మద్దిశెట్టి వర్గం రెండు గా చీలిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకేనని.. తానే గెలుస్తానని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి చేస్తున్న ప్రచా రంతో నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం మరింత రాజుకుంది. టికెట్ విషయంపై అధిష్టానం ఇంకా తేల్చలేదని మద్దిశెట్టి చెబుతుండగా.. బూచేపల్లి మాత్రం తనకే కన్ఫర్మ్ అయిందని ప్రచారం చేస్తున్నా రు. దీంతో మద్దిశెట్టికి అనుకూలంగా ఉన్నవారు.. బూచేపల్లికి అనుకూలంగా ఉన్నవారు రెండు వర్గాలుగా చీలిపోయారు.
ఇక, ఈ వర్గాల్లోనూ.. రెండు మూడు వర్గాలుగా మారి నాయకులు చక్రం తిప్పుతున్నారనే వాదన వినిపి స్తొంది. ఎలా చూసినా దర్శి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కలగా పులగం మాదిరిగా ఉందని పరిశీల కులు చెబుతున్నారు. దీంతో టికెట్ ఎవరికి ఇచ్చినా.. రెబల్ వర్గం రెడీ అవుతుందని.. ఖచ్చితంగా ఇక్కడ వైసీపీకి సంకట పరిస్థితి తలెత్తుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ప్రకాశం జిల్లాలో వైసీపీ కోల్పోయే తొలి సీటు ఇదేననే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.