టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మళ్లీ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే ప్రణాళిక రెడీ చేసుకున్న విషయంతెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు ఈ పాదయాత్రనునిర్వహించాలని ప్లాన్ చేసుకుని.. పాదయాత్రను కొనసాగిస్తు న్నారు. అనేక నిర్బంధాలు, ఒత్తిడిలు.. సహా పోలీసుల ఆంక్షలను కూడా ఎదుర్కొని ఈ యాత్ర ముందుకు సాగుతోంది.
అయితే.. ఈ ఏడాది ఆగస్టులో చంద్రబాబును అరెస్టు చేసిన దరిమిలా పాదయాత్రను నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఈ పాదయాత్రకు బ్రేక్ పడింది. రోజుకు 10 నుంచి 15 కిలో మీటర్ల చేసిన పాదయాత్ర షెడ్యూల్ కన్నాముందుగానే గమ్యం చేరుతుందని అందరూ భావించారు. ఇక,ఇప్పుడు పాదయాత్ర నిలిచిపోయిన నేపథ్యంలో పార్టీలోనూ దూకుడు తగ్గిందనే భావన ఏర్పడింది. అప్పట్లో యువగళం పాదయాత్రకు సమాంతరంగా గ్రామీణ స్థాయిలోనూ పాదయాత్ర ముందుకు సాగింది.
ఆయా మండలాల్లో నాయకులు పాదయాత్రను ముందుండి నడిపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు యువగళం మేలు చేస్తుందన్న పార్టీ ప్రణాళికను అమలు చేశారు. అయితే..రాజోలులో ఈ పాదయాత్ర ఆగిపోయిన తర్వాత.. అందరూ కూడా చంద్రబాబు బెయిల్, ఆయన జైలు అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెంచారు. ఫలితంగా టీడీపీపై జరుగుతున్న చర్చ కొంత మందగించింది. ఇప్పుడు ఈ పరిణామాలపై అంచనా వేసిన పార్టీ అధిష్టానం..పాదయాత్రను తిరిగి కొనసాగించాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా ఈ నెల 24 నుంచి ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. అయితే.. దాదాపు మూడు మాసాల సమయం పోయిన నేపథ్యంలో పాదయాత్రను నిర్ణీత లక్ష్యం మేరకు కాకుండా.. కొంత తగ్గించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు వెళ్లాలని అనుకు న్నా.. ఎన్నికలకు సమయం వచ్చేస్తున్న నేపథ్యంలో విశాఖ వరకే ఈ యాత్రను పరిమితం చేయనున్నట్టు చెబుతున్నారు.
అయితే.. పాదయాత్రలో ఈ దఫా ఎక్కువ మంది ప్రాతినిథ్యం ఉండేలా చూడాలని నిర్ణయించడం గమనార్హం. ఎన్నికల సమయం కావడంతో వైసీపీపై మరింత పోరు చేయడంతోపాటు.. జనసేనతో కలిసి కూడా పాదయాత్రను మరింత విజయం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.