టీడీపీ అధినేత చంద్రబాబుపై నగరి ఎమ్మల్యే, ఏపీఐసీసీ చైర్మన్ రోజా మరోసారి ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల జోలికి వస్తే ఊరుకునేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శ్రేణుల వ్యవహారం ఇలాగే కొనసాగితే ప్రజాయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని రేపుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. గురువారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ నిర్వహించిన సమ్మిట్‌లో పాల్గొనేందుకు రోజా వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న రాజధాని అమరావతి ప్రాంత మహిళలు, రైతులు అక్కడికి చేరుకుని యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలని నినాదాలతో హోరెత్తించారు. దీంతో యూనివర్సిటీలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని రోజాను మరో గేటు నుంచి అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయినప్పటికీ కొందరు మహిళా ఆందోళనకారులు రోజా కాన్వాయ్‌ను వెంబడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలవరించారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. టీడీపీ గూండాలే తనను అడ్డగించారని మండిపడ్డారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇకనైనా ఇలాంటి కుళ్లు రాజకీయాలు మానుకోవాలని ఆంటూ హెచ్చరించారు. అమరావతి రైతులను మోసం చేసింది తాము కాదని, మోసం చేసిన చంద్రబాబు, అప్పటి మంత్రులను అడ్డుకోవాలని రైతులకు సూచించారు. మరోసారి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై ఈ రకమైన చర్యలకు పాల్పడితే పరిణామాలకు తీవ్రంగా ఉంటాయని, చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రను అడ్డుకునే పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.