అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం జగన్. ఒక వైపు మూడు రాజధానుల అంశంపైనా ఇంటా బయటా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. మరోవైపు రాష్ర్టానికి ఆదాయం లేక అభివృద్ధి కుంటుపడుతున్న పరిస్థితితో సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నేతల నుంచి సరికొత్త తలనొప్పి తయారైంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ గ్రూపు తగదాలు ఒక్కొక్కటి బయటపడుతుండడం ఆందోళన రేకెత్తిస్తున్నది. మొన్నటిమొన్న నాడు దూషించిన వారికే మంత్రి పదవులిచ్చారని నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మల్యే ప్రసన్నకుమార్ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. పార్టీలోని అసంతృప్తి నేతల మనోగతాన్ని బయటపెట్టింది. దీనిపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారమే లేచింది.
ఇదిలా ఉండగా తాజాగా గుంటూరు జిల్లాలో సొంత పార్టీ నేతల బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతల్లోని అసంతృప్తికి అద్దం పుడుతున్నది. జిల్లాలోని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఆ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇక తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మధ్య గొడవలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా మర్రి రాజశేఖర్‌కు, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ మధ్య సైతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తున్నది. ఇలాగే మరికొన్న నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొన్నది.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఇక పార్టీ వ్యవహారాలపైనా నజర్ వేశారు. గ్రూపు తగాదాలతో పార్టీ పరువును తీస్తున్న నేతలపై గుర్రుగా ఉన్నారట. ఇప్పటికే ఆయన ఆయన జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులకు ఈ విషయమైన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పలువురు వైసీపీ నేతలు తెలుపుతున్నారు. ఆయా మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారని సమాచారం. పార్టీ అయినా ప్రభుత్వం అయినా మంత్రులు సీరియస్‌గా తీసుకుని వ్యవహారాలు చక్కబెట్టాలని సూచించినట్లు వైసీపీ నేతలు పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అంతర్గత విభేదాల పరిష్కరించడంతో పాటు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను కూడా మంత్రుల భుజస్కందాలపై మోపారని ప్రచారం సాగుతున్నదని. ఆయా అంశాల్లో పనితీరు కనబరచకపోతే వేటు తప్పదని సూత్రప్రాయంగా హెచ్చరించినట్లు సమాచారం. మరి ఏమవుతుందో? పార్టీ నేతలు విబేధాలను మరిచి కలిసికట్టుగా సాగుతారా? లేక స్థానిక పోరులో పార్టీ పుట్టిని ముంచుతారా?