పరిపాలన వికేంద్రీకరణ అంశంపై వైసీపీ ప్రభుత్వం ఒకవైపు ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నది. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నది. మరోవైపు అందులో భాగంగా రాజకీయంగా ఎంతో అవసరమున్నా శాసన మండలి రద్దుకు సైతం వెనుకాడలేదు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపింది. త్వరలో ఆమోదం లభిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విజిలెన్స్ కమిషనర్, తదితర కార్యాలయాలను శాసన రాజధానిగా ఏర్పాటు చేయనున్న కర్నూలుకు తరలించేందుకు గ్రీన్ సిగ్నల్‌ను ఇస్తూ జీవో 13ను జారీ చేసింది. ఎగ్గిక్యూటివ్ రాజధానిగా విశాఖను ఏర్పాటు చేసేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నది. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వానికి ప్రైవేట్ విమానయాన సంస్థలు భారీ ఝలక్‌ను ఇచ్చాయి.
ఇప్పటికే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన చేసింది. దీంతో రాష్ర్టంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పలు కీలకమైన పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలతో పాటు పౌర విమానయానం కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ సహా దేశీయంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. రాజధాని మారనున్నందున అక్కడి నుంచి సర్వీసులను ఉపసంహరించుకోవడం సబబుగా ఉందని వినిపించింది. అయితే ఎగ్గిక్యూటివ్ రాజధానిగా మారనున్న విశాఖ నుంచి కూడా తమ సర్వీసులను ఉపసంహరించుకునేందుకు ప్రైవేటు విమానయాన సంస్ధలు సిద్ధమవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కారు తీరని దెబ్బగా మారనుంది.
ఏపీలో ఎక్కువ మంది ప్రయాణికులు కలిగిన విమానాశ్రయంగా విశాఖకు పేరుంది. ఇక్కడి నుంచి పలు ప్రైవేట్ విమానయాన సంస్ధలు ప్రతి రోజూ దేశ, విదేశాలకు సర్వీసులు నిర్వహిస్తుంటాయి. ఎయిర్ ఏషియా కోల్కతాకు నిత్యం నాలుగు విమాన సర్వీసును నిర్వహిస్తున్నది. అదేవిధంగా ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా చెన్నై, హైదరాబాద్ సర్వీసులను నడుపుతున్నది. స్పైస్ జెట్ కూడా ఢిల్లీకి సర్వీసులను నిర్వహిస్తున్నాయి. ఆ సంస్థలన్నీ తమ సర్వీసులను మార్చి నుంచి రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం సంచలనాన్ని రేపుతున్నది. మూడు రాజధానుల ప్రకటనపై ఎలాంటి స్పష్టత రాకపోవడమేగాక, ఆ దిశగా ఇంకా ఎలాంటి అడుగులు పడకపోవడంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ విమానయాన సంస్ధలు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా
విమానయాన సంస్ధలు తమ సర్వీసులు ఉపసంహరించుకుంటే రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, వారి ద్వారా వచ్చే పెట్టుబడుపైనా తీవ్ర ప్రభావం పడనుందని ఆందోళన రేకేత్తుతున్నది.