వైసీపీ నిఘా పెట్టింది 12 మంది మీద‌… దొరికింది ఇద్ద‌రేనా…!

వైసిపి అధిష్టానం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముందు నుంచి సీనియర్ నేతలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. అయితే అధిష్టానం అనూహ్యంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడిపి అభ్యర్థికి ఓటు వేసారంటూ.. వారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

అయితే శ్రీదేవి, చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా తాము వైసిపి అభ్యర్థులకే ఓటు వేసామని చెబుతున్నారు. తమను పార్టీ ఎందుకు ? సస్పెండ్ చేసిందో సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్ తో పాటు సజ్జ‌ల‌ రామకృష్ణారెడ్డి పై తీవ్రమైన విమర్శలు కురిపించారు. అటు చంద్రశేఖర్ రెడ్డి కూడా జగన్ తో పాటు సజ్జలను టార్గెట్ చేస్తున్నారు.

అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారని ముందు నుంచే వైసిపికి అనుమానాలు ఉన్నాయి.
అందుకే క్రాస్ ఓటింగ్ చేసే ఎమ్మెల్యేలు జాబితాలో చాలామంది పేర్లు ముందే బయటకు వచ్చాయి. సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు కృష్ణా జిల్లా ఎమ్మెల్యే ఒక‌రు, అలాగే రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక మాజీ మంత్రి తో పాటు ఉత్తరాంధ్ర‌ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా అనుమానితుల‌ జాబితాలో చేరాయి.

మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వైసిపి ఇంటిలిజెన్స్ వర్గాలు ఏకంగా 12 మంది పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు కచ్చితంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారని ముందు నుంచి ఉన్న అనుమానాల నేపథ్యంలోనే ఈ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విష‌యం ఆ ఎమ్మెల్యేల‌కు కూడా తెలుసు అంటున్నారు. అయితే చివరలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎంత అసంతృప్తి ఉన్నా.. వీరు కాస్త ఓపిక ప‌ట్టి అధిష్టానం చెప్పినట్టే ఓట్లు వేశారు.

నలుగురు మాత్రం పార్టీ అధిష్టానం ఆదేశాలు సైతం ధిక్కరించి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. అయితే పార్టీలో ఉండలేక.. ఇప్పటికిప్పుడు బయటకు రాలేక ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారని.. కొద్ది నెలల్లోనే వీరిలో మరికొన్ని వికెట్లు కూడా పడతాయని వైసిపి వాళ్లే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp