యరపతినేని శ్రీనివాసరావు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గురజాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాస్ నాయకుడు. ఎన్టీఆర్ హయాంలోనే ఆయన పార్టీలోకి అడుగులు వేశారు. మాచర్ల పొలిటికల్ గూండాలను ఎదుర్కొనేందుకు అప్పట్లో ఎన్టీఆర్ బలమైన మాస్ నేత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో యువ నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు, ప్రజల కోసం.. ఎంత దూరమైనా వెళ్లి పోరాడే శక్తి ఉన్న నాయకుడిగా ఎన్టీఆర్… యరపతినేని గుర్తించారు.
అప్పట్లో నిర్వహించిన ఎన్టీఆర్ ప్రచార యాత్రలో యరపతినేని తీరుతెన్నులు తెలుసుకుని భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. ఇలా .. టీడీపీ బాటపట్టిన యరపతినేని సుదీర్ఘ కాలంగా టీడీపీకి సేవలు అందిస్తు న్నారు. మొత్తంగా ఆరు సార్లు ఎన్నికల బరిలో పోటీ చేసిన యరపతినేని.. మూడు సార్లు విజయం దక్కించుకున్నారు. 1994లో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తొలిసారి ఆయన టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసి.. భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు.
తర్వాత.. 2009, 2014లోనూ యరపతినేని విజయానికి తిరుగులేకుండా పోయింది. పార్టీని క్షేత్రస్థాయిలో డెవలప్ చేయడంతోపాటు.. గ్రామ గ్రామాన టీడీపీ పునాదులు బలోపేతం అయ్యేలా పటిష్ఠ కార్యాచరణతో ముందుకు సాగారు. అంతేకాదు.. టీడీపీని నడిపించడంలో ఎదురైన అనేక ఇబ్బందులను ఆయన ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే 2012లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు `వస్తున్నా మీకోసం యాత్ర` చేపట్టిన సమయంలో టీడీపీ నేతలను రాష్ట్రంలోకి తీసుకువచ్చేందుకు భయపడ్డారు.
ఇలాంటి సమయంలో కూడా .. నేనున్నానంటూ.. యరపతినేని ధైర్యం చేశారు. రాష్ట్ర విభజన వేడి.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో జరుగుతున్న సమయంలో యరపతినేని జోక్యం చేసుకుని నాడు చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీ కోసం యాత్రకు నల్లగొండ నుంచి ఏపీలోకి గుంటూరు జిల్లాలోని తన నియోజకవర్గంలోకే ఎంటర్ అయ్యేలా భారీ ఏర్పాట్లు చేసి ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ అయ్యారు. అప్పట్లోనే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైలెట్ అయ్యింది. యరపతినేని ఈ 30 ఏళ్లలో భయంకరమైన మాస్ లీడర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు.
నాడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రంగంలోకి దిగిన యరపతినేని.. అనేక కష్టాలు.. నష్టాలు ఎదుర్కొని కూడా పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. 2019 ఎన్నికలకుముందు.. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు.. అమలు చేసిన.. పసుపు కుంకుమ పధకానికి.. యరపతినేని ప్రేరణే కారణమని పార్టీ నాయకులు చెబుతారు. ఎందుకంటే.. ఆయన తన నియోజకవర్గంలో పేద వర్గానికి చెందిన మహిళలకు సీమంతం చేయండంతోపాటు.. చిన్నారులకు అక్షరాభ్యాసం.. వంటి కార్యక్రమాలు చేయించి.. ఆర్థికంగా కూడా ఆదుకున్నారు.
ఇక, తాజాగా కూడా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ.. భౌతికం గా ఆయన ప్రజలకు చేరువ అవుతూనే ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఇప్పటికీ.. ఆయననే ఎమ్మెల్యేగా భావిస్తూ.. అనేకసమస్యల పరిష్కారం కోసం.. నిత్యం ఆయన ఇంటికి వస్తూనే ఉన్నారు. యరపతినేనిలో ఇన్నేళ్లలో రాజకీయంగా ఇంత ఎదిగినా కెరీర్ ప్రారంభంలో ప్రజలకు ఎంతలా అందుబాటులో ఉంటున్నారో ఇప్పటకీ అదే పంథాలో ఉండడం గొప్ప విషయం.
ప్రస్తుతం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ నియోజకవర్గం నుంచి మాచర్ల నియెజకవర్గం మీదుగా గురజాల నియోజకవర్గంలోకి అడుగు పెట్టనుంది. ఈ క్రమంలో ఈ పాదయాత్రను కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు లోకేష్ యువగళం పాదయాత్ర జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ అద్దంకిలోనే టాప్‌లేపింది. ఇప్పుడు పిడుగురాళ్ల టౌన్‌లోకి ఎంటర్ అయ్యే టైంకు అద్దంకిని మించిన రేంజ్‌లో సక్సెస్ చేసేలా యరపతినేని కసితో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు నారా లోకేష్ వరకు కూడా టీడీపీకి అత్యంత విధేయ నాయకుడిగా యరపతినేని నాడు-నేడు-ఏనాడూ తన సేవలు అందిస్తుండడం గమనార్హం.