సీమ డిక్లరేషన్.. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై పోరు బాట పేరుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. సీమ జిల్లాల్లో నాలుగు రోజుల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్క పుంగనూరు మిన హా.. మిగిలిన ప్రాంతాల్లో ఆయన చేపట్టిన యాత్రలు సక్సెస్ అయ్యాయి. ప్రజలు తండోపతండాలుగా కూ డా కదలి వచ్చారు. చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే పూతలపట్టు నియోజకవర్గానికి అభ్యర్థిని కూడా చంద్రబాబు ఖరారు చేశారు.
ఇక, ఇప్పుడు చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలపైనా కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మరింత పుంజుకు నేలా ఆయన ప్లాన్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ హవా సాగినప్పటికీ.. ఇక్కడ టెక్కలి, శ్రీకాకుళం ఎంపీ స్థానాల తో పాటు ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనూ పార్టీ విజయం దక్కించుకుంది. జగన్ పాదయాత్ర దూకుడు, వైసీపీ హవా సాగినప్పుడే.. జిల్లాలో ఈ రేంజ్‌లో దూకుడు ప్రదర్శించిన టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.
శ్రీకాకుళం పర్యటనలో ఉద్దానం ప్రాంతాన్ని ఆయన సందర్శించనున్నారు. అదేవిధంగా పలాస ఎమ్మె ల్యే అభ్యర్థిగా గౌతు శిరీషను, శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ది విషయంలో గతంలో తాము చేసిన అభివృద్ధి.. ప్రస్తుత ప్రభుత్వ ఉదాసీనత వంటి వాటిని కూడా చంద్రబాబు ప్రజల సమక్షంలో వివరించనున్నారు.
అదేవిధంగా వెనుక బడిన జిల్లాల అబివృద్ధినిధులతో శ్రీకాకుళంలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా ఆయన వివరించనున్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి గత తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. ఇక, స్థానిక వైసీపీ నేతల అక్రమాలు.. కేసులు వంటివాటిని ప్రధానంగా చంద్రబాబు చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో టీడీపీ కార్యకర్తలను, నాయకులను కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి సమాయత్తం చేయనున్నట్టు సీనియర్ నేతలు తెలిపారు.