కృష్ణా జిల్లా గన్నవరంలో అధికార వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత గత ఎన్నికలలో పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపి నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ పై కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనంతరం వంశీ, వైసీపీకి దగ్గరయ్యారు.
అప్పటినుంచి ఇద్దరి మధ్య సయోధ్య లేదు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనకు వైసిపి నుంచి టికెట్ రాదన్న నిర్ణయానికి యార్లగడ్డ వచ్చేశారు. జగన్ కూడా యార్లగడ్డకు ప్రాధాన్యత తగ్గించడం.. అటు వంశీ వచ్చే ఎన్నికలలో వైసీపీ టికెట్ తనదే అనే ప్రకటించుకోవడం.. చివరకు జగన్ అపాయింట్మెంట్ కూడా లేకపోవడంతో యార్లగడ్డ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే ఈరోజు తన అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ఆయన భవిష్యత్తు కార్యచరణ పై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని మీడియా ముఖంగా టిడిపి అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంలోనే ఆయన సైకిల్ ఎక్కేస్తారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనే టిడిపి అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
లోకేష్ నుంచి కూడా యార్లగడ్డకు సానుకూల సంకేతాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ఆయన సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ అసెంబ్లీకి వస్తారని.. తాను గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో జగన్ ను కలుస్తా అంటూ సవాల్ చేశారు. ఏది ఏమైనా గన్నవరం రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయన్నది క్లారిటీ వచ్చేసింది.