ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం వైసీపీ అడ్డ‌దారిలో వెళుతోందా…!

గెలుపు కోసం పోటీ ప‌డి..ప్ర‌జాస్వామ్యయుతంగా ప్ర‌జ‌ల ఆశీర్వాదం పొంద‌డం.. ఒక ఎత్తు. కానీ, ఎలాగైనా గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఎత్తులు వేయ‌డం మ‌రో ఎత్తు. కానీ, ఎలాగైనా గెలవాల‌నే ఉద్దేశంతో అడ్డ‌దారు లు తొక్క‌డం ఇంకో వ్యూహం. ఇప్పుడు ఈ మూడో వ్యూహాన్నే వైసీపీ అనుస‌రిస్తోంద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అనేక అడ్డ‌దారులు వేసుకుంటోంద‌ని వారు ఆరోపిస్తున్నారు.

ఇప్ప‌టికే అనేక చోట్ల ఎమ్మెల్సీను ఏక‌గ్రీవం చేసుకున్న వైసీపీ. ఇప్పుడు దండోపాయానికి దిగింద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ప‌శ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రత్యర్థి అభ్యర్థులను అధికార పార్టీ టార్గెట్‌ చేస్తోందని చెబుతున్నారు. పోలింగ్‌ సమయం దగ్గరపడటంతో దూకుడు పెంచిందని అంటున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందని టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.

తాజాగా కొన్ని సంఘాల కార్యాలయాల్లో అధికారులు సోదాలకు దిగుతున్నారని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తు న్నారు. కడప జిల్లాలో ఏపీటీఎఫ్‌-1938 నాయకులకు ఇటీవల అధికార పార్టీ నేతలు డీఈఓలపై ఒత్తిడి తెచ్చి నోటీసులు ఇప్పించారని, కొందరు ఎస్టీయూ, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా నోటీసులు ఇప్పించారని చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పుతున్న డాక్టర్‌ అనిల్‌ వెంట నడుస్తున్న సంఘాల నాయకులను టార్గెట్‌ చేస్తున్నారని చెబుతున్నారు.

 

ఆయనకు మద్దతు ఇచ్చిన ఉపాధ్యాయ సంఘాల కార్యాలయాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారని టీడీపీ నేత‌లు దుయ్య‌బ‌ట్టారు. గత రెండు, మూడు రోజులుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికార పార్టీ పెద్దలు పోలీస్‌ పవర్‌ను కూడా వాడుతున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం తాడిపత్రిలోని రూపాయి డాక్టర్ అనిల్ నిర్వహిస్తున్న ఆస్పత్రి వద్దకు పోలీసులను పంపి హెచ్చరికలు జారీచేసినట్లు చెబుతున్నారు. కడప జిల్లాలో కూడా కొందరి ఇళ్ల వద్దకు అధికార పార్టీ నేతలు, అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌లు..రివ‌ర్స్ వ్యూహం రెడీ చేసుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags: ap politics, intresting news, latest news, latest viral news, political news, social media, social media post, telugu news, trendy news, viral news, ysrcp, ysrcp leader